ఐదేళ్లు.. కట్టలు తెగిన నిర్లక్ష్యం

‘‘ నాన్న సీఎంగా ఉన్న కాలంలో కర్నూలు-కడప (కేసీ) కెనాల్‌ ఆయకట్టు మొత్తానికి నీరు అందేది.. రెండు కార్ల పంటలు పండేవి.. చంద్రబాబు పాలనలో కేసీ ఆయకట్టు సాగు తగ్గిపోతోందని’’ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్‌ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.

Updated : 22 Jun 2024 05:48 IST

ఎక్కడికక్కడ కూలిపోతున్న కేసీ కాల్వ
నిర్వహణ కొరవడంతో తలెత్తిన ముప్పు

సుంకేసుల వద్ద కేసీ కాల్వ పరిస్థితి

‘‘ నాన్న సీఎంగా ఉన్న కాలంలో కర్నూలు-కడప (కేసీ) కెనాల్‌ ఆయకట్టు మొత్తానికి నీరు అందేది.. రెండు కార్ల పంటలు పండేవి.. చంద్రబాబు పాలనలో కేసీ ఆయకట్టు సాగు తగ్గిపోతోందని’’ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్‌ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్‌’ తేల్చింది. ఐదేళ్లు నిర్వహణ లేకపోవడంతో 2,65,628 ఎకరాలకు నీరు అందించే కేసీ కాల్వ ప్రమాదంలో పడింది.. కాల్వలో వంద క్యూసెక్కుల నీరు ప్రవహిస్తే తెగిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల శాతనకోట కాల్వ గోడ కుప్పకూలడంతో 50 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం కానుంది. కాల్వ పొడవునా ఇదే పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, నందికొట్కూరు

31.90 టీఎంసీలు కేటాయింపు

కేసీ(కర్నూలు-కడప) కెనాల్‌ కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయం నుంచి 304 కి.మీ మేర వైఎస్సార్‌ జిల్లా  కృష్ణాపురం వరకు విస్తరించి ఉంది. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల పరిధిలో ఖరీఫ్‌ రబీ పంటలకు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు 31.90 టీఎంసీల నీటిని 2,65,628 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంది. బచావత్‌ అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి 10 టీఎంసీలు, నదీ ప్రవాహ జలాలు 21.90 టీఎంసీలు కేటాయించారు. సుంకేసులలో 1.20 టీఎంసీలు నిల్వ చేసి ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. కేసీ కాలువకు 31.90 టీఎంసీల నీటి వాటాను కృష్ణా జల వివాదాల పరిష్కార సంస్థ (కేడబ్ల్యూడీటీ) కేటాయించింది. తుంగభద్ర జలాశయం ద్వారా 10 టీఎంసీలు.. మిగిలినవి నది ద్వారా (వరద జలాలు) తీసుకోవాల్సి ఉంటుంది.

కుంగిన కట్ట.. చెదిరిన లైనింగ్‌

సుంకేసుల జలాశయం (0 కి.మీ) నుంచి 40 కి.మీ వరకు ఇరువైపులా కట్టలు నెర్రలు బారాయి. లైనింగ్‌ కుంగి దెబ్బతింది. మట్టి పేరుకుపోయింది. స్లూయిజ్, షట్టర్లు దెబ్బతిన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు, శాతనకోట, మల్యాల, పగిడ్యాల, జూపాడుబంగ్లా పరిధిలో లైనింగ్‌ పూర్తిగా దెబ్బతింది. కొన్నిచోట్ల లైనింగ్‌ పూర్తిగా కొట్టుకుపోయింది.

ప్రధాన కాల్వ 60 కి.మీ దాటిన తర్వాత లైనింగ్‌ పలుచోట్ల దెబ్బతింది. మల్యాల నుంచి ముచ్చుమర్రి వరకు అధ్వానంగా ఉంది. పలుచోట్ల పగుళ్లు వచ్చాయి.. కొన్నిచోట్ల భారీగా కుంగిపోయింది.. కాల్వకు ఇరువైపులా ముళ్లపొదలు దట్టంగా పెరిగాయి. కాల్వ అడుగుభాగం (బెడ్‌) దెబ్బతిని బురద మేట వేసింది. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిండిపోయాయి. సాగు నీటి కాల్వ మురుగుమయంగా మారింది.


కుప్ప కూలింది

నందికొట్కూరు మండలం శాతనకోట సమీపంలో ఇటీవల కేసీ కాల్వ గోడ కుప్పకూలింది.. 72వ గేటు సమీపంలో కాల్వ కట్ట, గోడ దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతులు చేసేందుకు డబ్బుల్లేవని చేతులెత్తేశారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి గోడ కూలిపోయింది. త్వరలోనేసుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తే అవకాశం ఉంది.. వెంటనే మరమ్మతులు చేయకుంటే కాల్వ కట్ట మొత్తం తెగిపోయే ప్రమాదం ఉంది.. కాల్వ దెబ్బతిన్న ప్రాంతం నుంచి 120 కి.మీ వరకు ఉన్న 50 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం కానుంది.


నిధులివ్వని గత ప్రభుత్వం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండి ఆత్మకూరు, మహానంది, నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు మండలాల పరిధిలో కాల్వ విస్తరించి ఉంది. 2009లో వచ్చిన వరదలకు కేసీ కాల్వ చాలాచోట్ల దెబ్బతింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.124 కోట్లు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు. నిధుల్లేక మరమ్మతులు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించారు. సుంకేసుల జలాశయం అభివృద్ధి, ప్రధాన కాల్వకు ఇరువైపులా లైనింగ్‌కు మరమ్మతులు, కొన్నిచోట్ల శాశ్వత నిర్మాణాలు వంటి పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్రం రూ.514.40 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం వాటా విడుదల చేయకపోవడంతో పైసా రాలేదు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌తో సంప్రదించాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు వేయలేదు.

రైతులకు ఏటా రూ.168 కోట్ల నష్టం

కేసీ ప్రధాన కాల్వ నీటి సామర్థ్యం 3,850 క్యూసెక్కులు. అంత మేర నీటిని కాల్వకు విడుదల చేస్తే తెగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 2,100 క్యూసెక్కులు మించి వదలడం లేదు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీనిని అధిగమించేందుకు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల వినియోగిస్తున్నారు. వీటిని అదనంగా నడిపించడం వల్ల నిత్యం రూ.4 లక్షల అదనపు భారం పడుతోంది. నందికొట్కూరు నియోజకవర్గం శాతనకోట-మల్యాల మధ్యలో విద్యుత్తు మోటార్లు వేసుకుని నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చాగలమర్రి సమీపంలో పంట కాల్వ ఆనవాళ్లు కోల్పోయింది. నీరు అందక దాదాపు రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారింది. కాల్వ పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో రెండో పంటకు నీరందకపోవడంతో సుమారు 56 వేల ఎకరాల్లో పంటలు సాగవ్వడం లేదు. ఎకరాకు రూ.30 వేల ప్రకారం ఏటా రూ.168 కోట్ల మేర ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు