పోయేది ప్రజల ప్రాణాలేగా..!

ప్రుత్తూరులో మూడేళ్ల క్రితం జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారి ప్రభాకర్‌రావు ఉన్నప్పుడు రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. ఆ రెస్టారెంట్‌లలో కుళ్లిన చికెన్, అధిక మోతాదులో రంగులేసిన గోబీ మంచూరియాను చెత్త డబ్బాలో వేశారు.

Updated : 22 Jun 2024 06:07 IST

జిల్లాలో విచ్చలవిడిగా ఆహార కల్తీ
పట్టించుకోని అధికారులు 
నిషేధిత రసాయనాల వాడకంతో ప్రజారోగ్యం గుల్ల

  • ప్రుత్తూరులో మూడేళ్ల క్రితం జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారి ప్రభాకర్‌రావు ఉన్నప్పుడు రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. ఆ రెస్టారెంట్‌లలో కుళ్లిన చికెన్, అధిక మోతాదులో రంగులేసిన గోబీ మంచూరియాను చెత్త డబ్బాలో వేశారు. మరోసారి దాడులు చేసి మాంసం దుకాణాలు, చికెన్‌ దుకాణాలు తనిఖీ చేశారు. అనంతరం ఒక్క అధికారి కూడా వచ్చి తనిఖీ చేసిన దాఖలాల్లేవు. 
  • ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో హోటళ్లు, రెస్టారెంట్లు కోకొల్లలు. నిత్యం వేల మంది భక్తులు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హాటళ్లు వెలిశాయి. వాటిలో అసలు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా? లేదా? అని పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. 

పుత్తూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలు పక్కనే ఉండటంతో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది.. ప్రజల ఆరోగ్యంతో కల్తీ మాఫియా ఆటలాడుతోంది. జిల్లాలో నిత్యావసరాలు, తినుబండారాలు, మాంసం, పాలు, నూనె ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య సంర క్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా అవి కాగితాలకు పరిమితమవడం గమనార్హం. 

తూతూమంత్రంగా తనిఖీలు..

మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లను ఆసరా చేసుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఎక్కువగా ఆహార కల్తీ సాగుతోంది. ఉన్నతాధికారులు కన్నెత్తి చూడటం లేదు. తూతూమంత్రంగా అప్పుడప్పుడు తనిఖీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో జరిగే మోసాలు, లోపాలపై దృష్టి సారిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఆహార తనిఖీ విభాగంలో సిబ్బంది కొరత, ఇతర శాఖల అధికారుల్లో నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపం.. ధనార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న అక్రమ వ్యాపారుల ధోరణి వెరసి ప్రజారోగ్యం కల్తీకి గురవుతోంది. కాగ్‌ నిబంధనల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి లక్ష మందికి ఒక ఆహార తనిఖీ అధికారి ఉండాలి. ప్రస్తుతం ఆ స్థాయిలో అధికారులు, సిబ్బంది లేరు. చికెన్‌ పకోడీ, బజ్జీ దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లలో రోజూ కాగిన నూనెనే వాడటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. 

అధిక మోతాదులో అద్దేసిన రంగులు 

పత్తాలేని సమీక్షలు..

నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో నెలకోసారి సమావేశాలు పెట్టి శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు దిశానిర్దేశం చేయాలి. ఆ దిశగా గడిచిన ఐదేళ్లుగా ఎక్కడా సమావేశాలు పెట్టిన దాఖలాల్లేవు. ఇది ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా కేంద్రంలో కూర్చుని ఎప్పుడో ఓసారి తనిఖీ చేసి రికార్డుల్లో చూపుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా తాగునీటి శుద్ధి ప్లాంటు వెలిశాయి. అవి ప్రమాణాల ప్రకారం నడుస్తున్నాయా? లేదా? అని తనిఖీ కూడా చేయడం లేదు. 

తరచూ తనిఖీ చేస్తున్నాం..

మాకు కేటాయించిన ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తున్నాం. లోపాలు ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. మున్సిపాలిటీల్లోనూ శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు తనిఖీ చేసే అధికారం ఉంది. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయిస్తాం.

- జగదీశ్వరరావు, ఆహార కల్తీ నియంత్రణ అధికారి, తిరుపతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని