పట్ట పగలే దొంగల బరితెగింపు..

ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న చోరీలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే దొంగలు బరితెగిస్తున్నారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన దొంగతనాలు పల్లెలకు పాకాయి.

Updated : 22 Jun 2024 06:47 IST

ప్రాణాలు తీయడానికీ వెనుకాడని వైనం
వరుస ఘటనలతో జనం బెంబేలు.. 

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న చోరీలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే దొంగలు బరితెగిస్తున్నారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన దొంగతనాలు పల్లెలకు పాకాయి. ఈ మధ్య కాలంలో జరిగిన చోరీల్లో అధికంగా పట్టపగలే చోటుచేసుకున్నవి కావటం గమనార్హం. ఈ వరుస దొంగతనాలు ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్నాయి.

  • ఇటీవల ఎన్నికల హడావుడి, తరచూ పోలీసులు గ్రామాల్లో సంచరించడం, సాయుధ బలగాల కవాతు వల్ల మూడు నెలలుగా చోరీ ఘటనలు తగ్గుముఖం పట్టాయి. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియడంతో పోలీసుల సంచారం తగ్గింది. దీన్ని దొంగలు ఆసరాగా చేసుకొని దొంగతనాలకు తెగబడుతున్నారు. 
  • ప్రస్తుతం పల్లెల్లో వ్యవసాయ పనులు ప్రారంభమవడంతో జనం ఎక్కువగా పొలాలకు వెళ్తున్నారు. ఇదే అదనుగా భావించి పల్లెల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు చేస్తున్నారు. గురువారం కళ్యాణదుర్గం మండలం నారాయణపురంలో రైతు ఆదినారాయణ కుటుంబం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన కొందరు రైతు ఇంట్లోకి చొరబడి రూ.2.65 లక్షల నగదు, 3 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ నెల 14న రామగిరి మండలం నసనకోటలో ఓ రైతు ఇంట్లో రూ.1.80 లక్షల నగదు, 2 తులాల బంగారు నగలను మాయం చేశారు. 

వాహనాలను సైతం..

ఈ నెల 2న అనంతపురం నగరం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఓ గుత్తేదారు సంస్థ కార్యాలయం ఎదుట పార్కింగ్‌ చేసిన బొలెరో వాహనాన్ని మరో బొలెరో వాహనానికి కట్టుకుని అపహరించారు. ఇలా వరుస ఘటనలు జిల్లాలో ఏదో ఒక మూలన జరుగుతున్నాయి.

110 తులాల బంగారు నగలు

ఉమ్మడి జిల్లాలో మార్చి 1 నుంచి జూన్‌ 21 వరకు మొత్తం 44 చోరీలు జరిగాయి. అందులో 110 తులాల బంగారు నగలు, రూ.37లక్షల నగదు చోరీకి గురయ్యాయి. వీటిలో అనంతపురం నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన 30 తులాల బంగారం, రూ.37వేల నగదు చోరీ పెద్దది. మూడు గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు.

అడ్డొచ్చిన వారిని గాయపర్చి..

చోరీ చేసే సమయంలో తమ పనికి అడ్డొచ్చిన వారిని గాయపరచి భయపెట్టడానికి, అవసరమైతే చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నాయి. రెండు నెలల కిందట అనంత గ్రామీణంలోని కురుగుంట గ్రామ సమీపంలో గేదెలు మేపుతూ ఒంటరిగా ఉన్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించారు. అటకాయించిన బాధితురాలిపై కత్తిని చూపి భయపెట్టారు. ఈ నెల 20న మడకశిర మండలం ఎల్లోటిలో మహిళ చంద్రక్క ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కత్తితో గొంతుపై గాయపరిచి, ఇంట్లోని రూ.20 వేల నగదు, చెవికమ్మలు దోచుకెళ్లారు. 

దుకాణాల్లోనూ.. దొంగలు పగటి వేళ వినియోగదారులుగా వెళ్లి రెక్కీ చేసి రాత్రి వేళల్లో దుకాణాల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 16న ముదిగుబ్బ మండలం పాముదుర్తి క్రాస్‌లోని చరవాణి దుకాణంలో రాత్రివేళ దుండగులు చొరబడి విలువైన చరవాణులు, రూ.25 వేల నగదు చోరీ చేశారు. ఈ నెల 17న ముదిగుబ్బ ఆంధ్ర బ్యాంకు ఎదురుగా ఉన్న ఇంటి ముందు నిలిపి ఉంచిన స్కూటీపై చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు.

రైతులు హడల్‌.. 

ప్రస్తుతం పంటలు సాగు చేసే సమయం. రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులు, ఫైనాన్స్‌ సంస్థల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. మరికొందరు బంగారు నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఈ సీజన్‌లో బ్యాంకుల వద్ద చోరులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఏ రైతు ఎంత డబ్బు తీసుకెళ్తున్నారు.. ఎలా తీసుకెళ్తున్నారు అని గమనిస్తుంటారు. కుదిరితే బ్యాంకు లోపల, కుదరక పోతే బ్యాంకు బయట రైతులను బెదిరించి డబ్బు కాజేస్తున్నారు. గతేడాది ఉరవకొండ, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి డబ్బుతో బయటకు వచ్చిన రైతుల నుంచి నగదును ఎత్తుకెళ్లిన ఘటనలూ ఉన్నాయి. వరుస దొంగతనాలపై  పోలీసు శాఖ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యాత్మకంగా  ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని