ప్రైవేటు బడుల్లో.. దోపిడీ షురూ!

నాణ్యమైన విద్య అందించాలనే తాపత్రయంతో అప్పు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు.

Updated : 24 Jun 2024 04:01 IST

ఆసిఫాబాద్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేసి వస్తున్న వ్యక్తి

ఈనాడు, ఆసిఫాబాద్‌: నాణ్యమైన విద్య అందించాలనే తాపత్రయంతో అప్పు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇదే అదనుగా యాజమాన్యాలు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నారు. వీటి నియంత్రణపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏటా ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలను ఎక్కడా పాటించకపోవడంతో పాటు, అనుమతులు లేకుండానే కొనసాగుతున్నవి అధికంగా ఉన్నాయి. మరోవైపు అనుమతులు మంజూరు చేయడానికి సైతం చేయి తడపాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు కొద్ది సంవత్సరాలుగా డీఈఓ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కార్యాలయంలో ఎలాంటి పోస్టు లేకున్నా అనేక వ్యవహారాలు చక్కబెడుతుండటంతో.. ఏ డీఈఓ సైతం ఇతన్ని కదిలించలేకపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల అనుమతులు, పునరుద్ధరణ అన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. సదరు అధికారి అడిగినంత చేతిలో పెడితేనే అనుమతులు ఠంఛనుగా వస్తున్నాయి. దశాబ్దకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఆయనపై అధికారులను ప్రసన్నం చేసుకుని ఈ రీతిన వ్యవహారం నడుపుతున్నారనేది బహిరంగ రహస్యమే.

ఆసిఫాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల విక్రయాలు

పుస్తకాలు, దుస్తుల పేరుతో..

ప్రైవేటు పాఠశాలల్లో ఏవీ విక్రయించరాదన్న అధికారుల ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 119 పైవేటు పాఠశాలలు ఉండగా, దాదాపు 25వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు అన్ని ప్రైవేటులో పుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులను దర్జాగా విక్రయిస్తున్నారు. ఎల్‌కేజీ విద్యార్థికే రూ.3 వేల నుంచి రూ.4 వేలను కేవలం పుస్తకాలకే వసూలు చేస్తుండటం గమనార్హం. అడ్మిషన్‌ ఫీజులు రూ.వేలల్లో తీసుకుంటుండగా, టీసీలు, బోనఫైడ్‌ తీసుకునే సమయంలో సైతం రూ.1000 వరకు రాబడుతున్నారు. మా పాఠశాలలోనే పుస్తకాలు, దుస్తులు కొనాలని తల్లిదండ్రులను ఆదేశాలిస్తున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు, అయిదో తరగతి వరకు వచ్చే సరికి రూ.10 వేల చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. మళ్లీ పుస్తకాలు, పరీక్ష ఫీజులు, దుస్తులు ఖర్చులన్నీ అదనం. ఫీజుల నియంత్రణకు సంబంధిత అధికారులు కదలాల్సిన సమయమిదే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మండలాల్లో అనుమతులు లేనివే ఎక్కువ

జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ప్రతి మండలంలో 7 నుంచి 8 ప్రైవేటు పాఠశాలలు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలో సైతం ఎనిమిది పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. పాత భవనాల నుంచి కొత్త భవనాలకు మారి మరోచోటుకు తరలించినా అనుమతులు తీసుకోవాలనే నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదు. ఈ విషయమై కాగజ్‌నగర్‌ యువకులు ఆర్జేడీని ఆశ్రయించారు. దీనిపై ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లకు చెందిన ఎంఈఓలతో విచారణ చేయాలని ఆదేశాలు వచ్చి నెల గడిచినా.. ఎలాంటి తనిఖీలు లేకపోవడం గమనార్హం.

అనుమతులు లేని పాఠశాలల జాబితా

ఎంఈఓలతో తనిఖీలు చేయిస్తాం

- పి.అశోక్‌ కుమార్, డీఈఓ

ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు, పునరుద్ధరణ, వసతుల కల్పన, ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై ఆయా మండలాల ఎంఈఓలతో తనిఖీలు చేపడతాం. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని