ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించండి

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ సూచించారు.

Updated : 24 Jun 2024 06:41 IST

నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఈశ్వరమ్మను పరామర్శిస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుసేన్, చిత్రంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్, భాజపా నాయకుడు భరత్‌ప్రసాద్‌ 

నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ సూచించారు. ఆదివారం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో కలిసి పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి దాడి ఘటనకు కారణాలు, వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అమానవీయ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమెకు రూ.6లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఆ కుటుంబానికి ఎస్టీ కమిషన్‌ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువు చెప్పించాలన్నారు. 25 ఏళ్ల క్రితం ఈశ్వరమ్మ కుటుంబానికి ఇచ్చిన భూమి, ఇంటి పత్రాలు ఇప్పటికి వారి పేర్లపై లేవని, తక్షణమే ఆమె పేరుపై మార్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతుబంధు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆదివాసులందరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు ఆదివాసులకు అందేలా కృషి చేయాలన్నారు. జాటోత్‌ హుసేన్‌ వెంట భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కొల్లాపూర్‌ : ఈశ్వరమ్మపై దాడి ఘటనలో ఆమె బంధువు సలేశ్వరంను మొలచింతలపల్లిలో కలిసి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్, డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్, ఆర్డీవో నాగరాజు తదితరులు   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని