గిరిజనులకు డోలీమోతలు.. గుత్తేదారులకు డబ్బుల మూటలు!

పక్కన కనిపిస్తున్నది అనంతగిరి మండలం తేనెపట్టు నుంచి తలారిపాడు మార్గంలో ఓ  మహిళను డోలీపై మోసుకుంటూ తీసుకువస్తున్న చిత్రం  గిరిజన ప్రాంతాల్లో షరామామూలే అనుకుంటే పొరపాటే.

Updated : 25 Jun 2024 06:30 IST

మిషన్‌ కనెక్ట్‌ రోడ్ల పనుల్లో అక్రమాలు వెలుగులోకి..
పలు గ్రామాల్లో రూ. కోట్ల స్వాహా
ఈనాడు, పాడేరు

 గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న స్థానికులు

పక్కన కనిపిస్తున్నది అనంతగిరి మండలం తేనెపట్టు నుంచి తలారిపాడు మార్గంలో ఓ  మహిళను డోలీపై మోసుకుంటూ తీసుకువస్తున్న చిత్రం  గిరిజన ప్రాంతాల్లో షరామామూలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దస్త్రాల్లో వివరాల తేనెపుట్టు, తలారిపాడు రహదారి నిర్మాణం పూర్తయిపోయింది. సొమ్ములు గుత్తేదారు జేబులోకి వెళ్లిపోయాయి. మరి రోడ్డు పూర్తయినా ఈ డోలీమోతలేంటి అంటారా? రికార్డుల్లో కనిపించే ఈ మార్గం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. బిల్లులు మొత్తం లాగేసి పనులు అసంపూర్తిగా వదిలేశారు. అలా వదిలేసిన ఓ గోతిలో పడి కిలో రోజా అనే మహిళ గాయాలపాలై ఇలా డోలిమోతగా ఆ మార్గంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది.

తరాలు మారుతున్నా తలరాతలు మారని గిరిజన గ్రామాలెన్నో మన్యంలో ఉన్నాయి. కనీస మార్గం లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీమోతలే ఆయా గ్రామస్థులకు దిక్కవుతున్నాయి. అలాంటి కొండశిఖర గ్రామాలకు రోడ్ల కోసం ఉపాధి నిధులు మంజూరు చేస్తే వాటిని గుత్తేదారులు, వైకాపా నేతలు, అధికారులు వాటాలు వేసుకుని సొమ్ములు బొక్కేశారు. మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన మిషన్‌ కనెక్ట్‌ పాడేరు రోడ్ల పనుల్లో అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయి. దస్త్రాల్లో రోడ్లు కనిపిస్తున్నా.. రూ.కోట్ల ఖర్చుచేసినట్లు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల రోడ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. కొన్నిచోట్ల పనులు చేయకుండా, మరికొన్నిచోట్ల అరకొరగా చదును చేసి డబ్బుల మూటలు వెనకేసుకున్నారు.

ఇదిగో మిషన్‌ కనెక్ట్‌ మాయాజాలం: అనంతగిరి మండలం తేనెపుట్టు నుంచి తలారుపాడు వరకు గ్రావెల్, సీసీ పనులు చేసినట్లు రూ. 2.16 కోట్ల సామగ్రి సరఫరాదారు పేరిట బిల్లులు చేశారు. అక్కడ పనులు చూస్తే యంత్రంతో కోతపెట్టిన పనులే కొంతమేర కనిపిస్తున్నాయి. గ్రావెల్‌ వేసింది లేదు, సిమెంటు నిర్మాణాలు చేసింది లేదు. ఎన్నికల ముంగిట సీపీఎం నేతలు ఆ రోడ్డు పరిస్థితిపై ఆందోళన చేస్తే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి మిగతా పనులు 20 రోజుల్లో చేస్తామన్నారు. రెండు నెలలు గడిచినా ఆ రహదారి పని ఇప్పటికీ పూర్తికాలేదు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లో మిషన్‌ కనెక్ట్‌ పాడేరుతో 485 రోడ్ల పనులను 2021-22లో మంజూరు చేశారు. రూ. 354 కోట్ల అంచనా విలువగల ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.57.81 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ నిధులతో చేపట్టిన రోడ్లను పరిశీలిస్తే అందులో 50 శాతం కూడా పనులు జరగనే లేదు. కొన్నిచోట్ల కొండలను కొంత భాగం యంత్రాలతో తొలిచి చదునుచేసి వదిలేశారు. గ్రావెల్, మెటల్, కల్వర్టులు వేయకుండానే సొమ్ములు మాత్రం డ్రా చేసేశారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిధిలో ఎక్కువగా రోడ్ల పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి వైకాపా నేతలు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కయి రూ.కోట్లు పక్కదారి పట్టించారు.

దస్త్రాల్లోనే రోడ్డు.. దారంతా గోతులే అంటూ చూపుతున్న గిరిజన యువత

అంతా వారి కనుసన్నల్లోనే.. తాజా మాజీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, గిరిజన సంక్షేమశాఖ ఈఈగా పనిచేసి.. ఇప్పుడు ఈఎన్‌సీగా చేస్తున్న శ్రీనివాసరావు కలిసి కమీషన్ల కోసం ఎక్కువ పనులు ఒకే గుత్తేదారుకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. పనులు జరపకుండా గుత్తేదారుతో బిల్లులు మార్చుకుని వాటాలు పంచుకున్నారనేది గిరిజన సంఘాల నేతల మాట. కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల అక్రమాలపై విచారణ జరిపిస్తే అనంతగిరిలోనే కాదు... పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో అక్రమార్కులు వెలుగుచూస్తాయని అంటున్నారు.

  •  ఈ విషయమై ప్రస్తుత ఈఈ వేణుగోపాల్‌ వద్ద ప్రస్తావించగా రోడ్లన్నీ పూర్తిచేశామని, ఒకటి రెండు చోట్ల తుదిదశలో మార్పులతో ఆలస్యమైంది. వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

  •  మాగనాపల్లి, సరియా మధ్య రహదారికి ఈఐ గ్రాంట్‌ మంజూరు చేశారు. సుమారు రూ.9.61 లక్షలు ఖర్చయినట్లు చూపారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఆ పనులేవీ కనిపించడం లేదు. ఇక్కడ కూడా అటవీ అభ్యంతరాలున్నాయని నిలిపేశారు.
  •  చీడివలస నుంచి బొంగిజ వరకు ఎనిమిది కి.మీ మేర మిషన్‌ కటింగ్‌ ఫండ్‌గా రూ. 40 లక్షలు, సామగ్రి రూపంలో మరో రూ. 69 లక్షలు ఖర్చుచేశారు. కానీ ఈ రోడ్డుపై అంబులెన్స్, రేషన్‌ బండి కూడా వెళ్లే పరిస్థితి లేదు. అంత అధ్వానంగా ఉంది.
  • నిమ్మటం, కర్రిగూడ, కడరేవు రోడ్డు పనులు అసంపూర్తిగా చేసి వదిలేయడతో గిరిజన సంఘాల ఫిర్యాదుతో డ్వామా పీడీతో విచారణ జరిపించారు. అందులో కొన్నిచోట్ల పనులు చేయకపోయినే ఎం.బుక్‌లో నమోదైనట్లు గుర్తించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని