పెద్దాసుపత్రిలో.. వైకాపా ఆస్థాన కవి ఆధిపత్యం

వైకాపా హయాంలో ఆ పార్టీకి ఆస్థాన కవిగా పేరొందిన డాక్టర్‌ ప్రభాకరరెడ్డి కర్నూలు సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Updated : 25 Jun 2024 06:26 IST

ఆసుపత్రి పర్యవేక్షకుడి ఒంటెద్దు పోకడ
వివాదాస్పద నిర్ణయాలతో వైద్యుల అవస్థలు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : వైకాపా హయాంలో ఆ పార్టీకి ఆస్థాన కవిగా పేరొందిన డాక్టర్‌ ప్రభాకరరెడ్డి కర్నూలు సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోగులు, వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి పనిచేసిన ఆయన నిత్యం జగన్‌ను స్తుతిస్తూ కవితలల్లి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారు. పదోన్నతి జాబితాలో 80వ స్థానంలో ఉన్న ఆయనకు సీనియర్లను కాదని పదవి కట్టబెట్టారు. 

కర్నూలు సర్వజన ఆస్పత్రిలో నిత్యం మూడు వేల వరకు ఓపీ ఉంటుంది. మూడు వందలకుపైగా రోగులు ఇన్‌పేషెంట్లుగా చేరుతారు. ప్రత్యేక విభాగం (సూపర్‌ స్పెషాలిటీ) వైద్యులూ ఓపీ చూడాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అలా చేయడం వీలుకాదని వైద్యులు చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఏఆర్‌ఎంవోగా పనిచేస్తున్న వైద్యుడికి శానిటేషన్, సెక్యూరిటీ, డైట్, పెస్టు వంటి వాటి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనేమో.. తాను చెప్పింది చేయాల్సిందేనంటూ ఏజెన్సీలను హెచ్చరిస్తున్నారు. గతంలో ఏడాది కిందట పర్యవేక్షకుడిగా ఉన్న ఓ వ్యక్తికి ఆయన అన్నీతానై పలు ఏజెన్సీల నుంచి ఆర్థిక వనరులు సమకూర్చారన్న ఆరోపణలున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు నిత్యం ఓపీ చూస్తే కొన్ని విభాగాల్లో శస్త్రచికిత్సలు ఆగిపోయే పరిస్థితి. రోగులపై పర్యవేక్షణ తగ్గుతుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పర్యవేక్షకుడు ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో ఒక్కరోజూ ఓపీ చూసిన దాఖలాలు లేవు.  పనిచేసేవారిని మాత్రం నిత్యం ఓపీ చూడాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


షాడో పర్యవేక్షకుడిగా ఏఆర్‌ఎంవో 

షాడో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న అసిస్టెంట్‌ రెసిడెన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఏఆర్‌ఎంవో) గతంలో సార్జెంట్‌తో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌వోలు గతంలో పనిచేసిన పర్యవేక్షకుడికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి కొత్త పర్యవేక్షకుడు వచ్చిన వెంటనే సదరు ఏఆర్‌ఎంవోకు అధికారాలు వచ్చాయి. ఈ క్రమంలో అత్యవసరం విభాగం వద్ద ఉండాల్సిన సార్జెంట్‌ గదిని మార్చేశారు. ఆసుపత్రిలో ఏజెన్సీలు, ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయనతో మాట్లాడాల్సిందే. 


వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్‌

ప్రస్తుత పర్యవేక్షకుడి వ్యవహారాలపై ఇంటెలిజెన్స్‌ విభాగం వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షకుడి కుర్చీ ఎక్కగానే ‘‘ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది.. ఈనెల 9న ప్రమాణ స్వీకారానికి వెళ్దామా అంటూ ఓ వైద్యుడిని అడిగినట్లు తెలిసింది. ఈ విషయాన్నీ ఇంటెలిజెన్స్‌ వారు ఆరా తీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బదిలీ అవుతారన్న సమాచారం నేపథ్యంలో అధికార పార్టీ నాయకులను కలిశారు. ఎలాగోలా తన సీటు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 


ప్రత్యేక సేవలకే సమయం చాలదు

  • కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కార్డియాలజీ, కార్డియోథోరాసిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషియన్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, యూరాలజీ వంటి ప్రత్యేక విభాగాలు (సూపర్‌ స్పెషాలిటీ) ఉన్నాయి.
  • సోమ, గురువారాల్లో ప్లాస్టిక్‌ సర్జరీ, న్యూరో ఫిజీషియన్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథోరాసిక్‌ సర్జరీ ఓపీ ఉంటుంది. మంగళ, శుక్రవారాల్లో కార్డియాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ ఓపీ.. బుధ, శనివారాల్లో న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ ఓపీ ఉంటుంది. 
  • రోగుల పరిస్థితిని బట్టి అత్యవసర విభాగం, ఇతర విభాగాల నుంచి నేరుగా రోగులను చేర్చుకుంటారు. ఓపీ లేని రోజుల్లో కార్డియాలజీ విభాగంలో యాంజియోగ్రామ్‌లు, స్టెంట్లు, టూడీ ఎకో వంటివి చేయాల్సి ఉంటుంది. యూరాలజీ, కార్డియోథోరాసిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి విభాగాలవారు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. 
  • నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్, ఎండోక్రైనాలజీ విభాగాల్లో ఓపీ చూసిన తర్వాత వార్డుల్లో వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. కార్డియాలజీ వైద్యులు రాత్రివేళలోనూ సేవలు అందించాల్సి ఉంటుంది. 
  • ఏదేని ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి రోగులు వచ్చిన సమయంలో న్యూరో సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యులు రాత్రి వేళలోనూ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. 
  • గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ విభాగాల్లో వైద్యసేవలు నిత్యం అందించాల్సి ఉంటుంది. కార్డియోథోరాసిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ విభాగాల్లో మాత్రమే రోగుల సంఖ్య తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆయా విభాగాల వైద్య నిపుణులు మధ్యాహ్నం నుంచి డీఎం విద్యార్థులకు తరగతులు తీసుకోవాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని