ప్రక్షాళనకు ఇదే తరుణం.. సీఆర్డీఏలో తిష్ఠవేసిన జగన్‌ భక్త అధికారులు

రాజధాని అమరావతిని... జగన్‌ తన హయాంలో కక్ష గట్టి నాశనం చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. అమరావతి పునర్మిర్మాణంపై దృష్టి సారించి.. నవ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.

Updated : 25 Jun 2024 06:09 IST

ఇదే బృందంలో వ్యక్తికి శ్వేతపత్రం రూపకల్పన బాధ్యతలు
వీరిపై సీఎంవో, పురపాలక మంత్రి చర్యలు తీసుకుంటేనే ఫలితం

ఈనాడు - అమరావతి: రాజధాని అమరావతిని... జగన్‌ తన హయాంలో కక్ష గట్టి నాశనం చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. అమరావతి పునర్మిర్మాణంపై దృష్టి సారించి.. నవ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాజధాని నిర్మాణం అవాంతరాలు లేకుండా సాగాలంటే సమర్థులు, అంకితభావం గల అధికారులతోనే సాధ్యం. నిబద్ధత ఉన్న వారు లేకుంటే ప్రయాణం సాఫీగా సాగదు. సీఆర్డీఏలో ఉంటూ సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిని సాగనంపితేనే పూర్వ వైభవం సాధ్యం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మారి కూటమి సర్కారు కొలువుదీరినా ఇంకా సీఆర్డీఏలో ఇలాంటి వారి పెత్తనమే సాగుతోంది. గత ఐదేళ్లు అప్పటి అధికార పెద్దలతో అంటకాగిన వీరు.. ఇప్పుడు కూడా చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నారు. శ్వేతపత్రం తయారీ బాధ్యతను వైకాపా పెద్దలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తికే అప్పగించడమే ఇందుకు తార్కాణం.

రోజువారీ కార్యకలాపాల్లోకి చొరబాటు...

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం, ప్రస్తుత పరిస్థితిపై కూటమి సర్కారు శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. వీటి రూపకల్పనపై కీలకమైన శాఖలు తలమునకలై ఉన్నాయి. ఇందులో భాగంగా అమరావతిపై సీఆర్డీఏ కూడా శ్వేతపత్రం తయారు చేస్తోంది. జగన్‌ హయాంలో రాజధానిలో జరిగిన విధ్వంసం, నిర్మాణాల పురోగతి, గుత్తేదారులకు చెల్లింపులు, తదితర అంశాలతో ఈ పత్రం రూపొందుతోంది. ఇంతటి కీలకమైన పత్రం తయారీ బాధ్యతను వైకాపా వీర విధేయుడైన ఉద్యోగికి అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో అసోసియేట్‌ ప్లానర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ కుమార్‌ శ్వేతపత్రం తయారీ బాధ్యతలను చూస్తున్నట్లు తెలిసింది. వైకాపా హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, గత పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పూర్వ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌లకు చేరువయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తూ.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు, నారాయణ, తదితరులను ఈ కేసులో ఇరికిస్తే.. తన ప్రయోజనాలు నెరవేర్చుకుందామని భావించారు. తుది రూపు ఖరారు కాని, ఇంకా పనులు ప్రారంభం కాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో ఏదో జరిగిపోయినట్లు నమ్మించి, సీఐడీ అధికారులకు చేరువై కేసులు నమోదు చేయించడంలో కీలకపాత్ర పోషించారు.ఇన్నర్‌ రింగు రోడ్డుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకుండా ఇంకా మనోజ్‌కుమార్‌ మీదనే ఆధారపడుతున్నారు. దీనిపై మంత్రి నారాయణ దృష్టి సారించాల్సి ఉంది.  తెదేపా హయాంలో జరిగిన సమీక్షల తాలూకూ ప్రజెంటేషన్లను, వాటిలో తీసుకున్న నిర్ణయాలను వక్రీకరించి, డేటా ట్యాంపరింగ్‌ చేసి ఆ వివరాలను సీఐడీకి సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు, నారాయణలపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారని విమర్శలు బలంగా వినిపించాయి.

వ్యతిరేకులకు సమాచారం చేరే ప్రమాదం...

ప్రజెంటేషన్‌ పేరుతో సీఆర్డీఏలో రోజువారీ కార్యకలాపాలలో ఇతడిని భాగస్వామిని చేయడం సంస్థ మనుగడకు ప్రమాదం. ఇలా సంస్థలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తూ.. జగన్‌ భక్త అధికారులపై ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. సత్వర చర్యలు తీసుకోకపోతే రాజధాని రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. సంస్థలో జరిగే రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కుతుంది. అదను చూసి స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు, నారాయణలను అక్రమ కేసుల్లో ఇరికించే స్వభావం ఉన్న వ్యక్తులను ఉంచితే.. పక్కలో బల్లెంలో మారే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే సంస్థ మనుగడకు, రాజధాని అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని