కొండ భూములు కొట్టేశారు

కొలిమిగుండ్ల మండలంలో విలువైన భూములను వైకాపా నేతలు కొట్టేశారు. ప్రభుత్వ భూములకు డి-పట్టాలు పొంది పరిశ్రమలకు అప్పగించారు.

Updated : 11 Jul 2024 05:37 IST

కొలిమిగుండ్లలో భూ దందా
రూ.కోట్లు వెనకేసుకొన్న వైకాపా నేతలు

నిఘా విభాగం, న్యూస్‌టుడే: కొలిమిగుండ్ల మండలంలో విలువైన భూములను వైకాపా నేతలు కొట్టేశారు. ప్రభుత్వ భూములకు డి-పట్టాలు పొంది పరిశ్రమలకు అప్పగించారు. ఐదేళ్లు ‘అధికారం’ అండ చూసుకున్న ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ కబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఏర్పడిన అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా కొందరు భూములను దక్కించుకోగా... ఇంకొందరు గ్రామస్థాయి నాయకులు అధికారులను ప్రసన్నం చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులను భయపెట్టి డి-పట్టాలు పొంది సిమెంట్‌ కర్మాగారాలకు విక్రయించి రూ.కోట్లు వెనకేసుకొన్నారు. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఇటీవల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రకటించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పరిశ్రమలకు అప్పగించారు

కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో సిమెంట్‌ కర్మాగారాన్ని స్థాపించారు. దీంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కల్వటాల, నందిపాడు, పెట్నికోట, ఇటిక్యాల గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమితో పాటు కొండలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న వైకాపా నేతల కన్ను ‘ఖాళీ’ భూములపై పడింది. వాటికి డి-పట్టాలు పొంది పరిశ్రమకు అమ్మేశారు. అదేవిధంగా కొందరు సౌర విద్యుత్తు పరిశ్రమలకు లీజుకు ఇచ్చారు. ఎకరాకు రూ.30 వేల వరకు లీజు చెల్లించేలా ఒప్పంద పద్ధతిలో అప్పగించారు.

బినామీ పేర్లతో కాజేశారు

కల్వటాలలో గుండ్రాల్ల కొండ (నరసింహస్వామి కొండ)కు చెందిన సర్వే నంబరు-37లో 73.36 ఎకరాలు ఉన్నాయి. గత ప్రభుత్వం జగనన్న కాలనీకి మూడెకరాలు కేటాయించింది. ఎకరా రూ.5 లక్షల వరకు ధర పలుకుతుండటంతో 1.50 ఎకరాల చొప్పున ముగ్గురు, రెండెకరాల చొప్పున ముగ్గురు, ఐదెకరాల చొప్పున మరో ముగ్గురు అక్రమంగా పట్టాలు పొంది స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రమేయం లేకుండానే గ్రామానికి చెందిన మరో వైకాపా నాయకుడు దాదాపు 17 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ప్రభుత్వ భూమికి సిమెంటు కర్మాగార యాజమాన్యాలు గతంలో ఎకరాకు రూ.నాలుగు లక్షల ప్రకారం చెల్లించడంతో ఆయన ఆక్రమించిన భూమి విలువ దాదాపు రూ.68 లక్షలు ఉంటుందని అంచనా. కొలిమిగుండ్లకు చెందిన ఓ వైకాపా నాయకుడు ఇటిక్యాలలో సర్వే నంబరు 112-ఏలో దాదాపు వంద ఎకరాల కొండను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఐదెకరాల ప్రకారం 22 మంది పేర్లతో నాలుగేళ్ల కిందట డి-పట్టాలు మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ భూమి విలువ రూ.కోటికి పైగానే ఉందని చెబుతున్నారు.

వంతపాడిన రెవెన్యూ అధికారులు

భూ ఆక్రమణల్లో ఎక్కువ మంది వైకాపాకు చెందిన వారే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ విరమణ చేసిన ఆర్డీవోలు, తహసీల్దార్ల సీళ్లు, ప్రభుత్వ కార్యాలయాల ముద్రలతో డి-పట్టాలు పొంది సొమ్ము చేసుకున్నారనే విమర్శలు రేగుతున్నాయి. గతంలోనూ రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి కొలిమిగుండ్లకు సమీపంలో బత్తాయి తోటను ఆక్రమించారు. అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా బినామీ పేర్లతో డి.పట్టా పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీని విలువ దాదాపు రూ.ఆరుకోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తులకు డి-పట్టాలు

పెట్నికోట రెవెన్యూ గ్రామం పరిధిలో నాయునిపల్లె, గొర్విమానిపల్లెలు ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వ భూమి నామమాత్రంగా ఉంది. దాదాపు 80 శాతం ప్రభుత్వ భూమికి డి-పట్టాలు మంజూరయ్యాయి. పట్టాలు పొందిన వారు ఎవరు, ఎక్కడ ఉంటారనే విషయం ఎవరికీ తెలియడం లేదు. గ్రామాలకు సంబంధంలేని వారు పొరుగు జిల్లాల్లో ఉన్న వారికి కూడా డి-పట్టాలు మంజూరు చేశారనే విమర్శలు రేగుతున్నాయి. భూములిప్పిస్తామంటూ కొందరు వైకాపా నాయకులు ఎకరాకు రూ.15 వేల వరకు కమీషన్లు వసూలు చేశారు.


అక్రమాలపై సమగ్ర విచారణ

- సునీతాబాయ్, తహసీల్దారు, కొలిమిగుండ్ల. 

కొలిమిగుండ్ల మండలంలో భూఆక్రమణలు జరుగుతున్న విషయం తెలియదు. గ్రామాల వారీగా మంజూరు చేసిన డి-పట్టాలను పరిశీలించి సమగ్ర వివరాలు సేకరిస్తాం. డి-పట్టాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు రుజువైతే వాటిని రద్దు చేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని