ఇంజినీరింగ్‌లో చేరుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈఏపీసెట్‌ పరీక్షా ఫలితాలు ఇటీవల వచ్చాయి. త్వరలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరగనుంది. దీనికంటే ముందు విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Updated : 11 Jul 2024 09:23 IST

విద్యార్థులారా.. కళాశాల ఎంపికే చాలా కీలకం
బ్రాంచి వివరాలు పూర్తిగా తెలుసుకోండి
త్వరలో కౌన్సెలింగ్‌
న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌

ఈఏపీసెట్‌ పరీక్షా ఫలితాలు ఇటీవల వచ్చాయి. త్వరలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరగనుంది. దీనికంటే ముందు విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరిస్థితుల గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్నతస్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

 • బ్రాంచి, కళాశాల ఎంపికపై అవగాహన అవసరం ః ప్రస్తుత తరుణంలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), సీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇస్తుండగా తర్వాత స్థానాల్లో ఐటీ, ఈసీఈ, ట్రిపుల్‌ఈ ఉన్నాయి.
 • కంప్యూటర్‌ సైన్స్‌లో ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీస్‌ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
 • ద్యార్థులు తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని దానిపైనే దృష్టి సారించాలి. ఎవరో చెప్పారని, తోటి స్నేహితులు చేరారనో బ్రాంచిలను ఎంచుకోవటం సరికాదు. ఆసక్తి లేకుండా చేరితే ఆయా కోర్సులు సకాలంలో పూర్తి చేయలేకపోవటమే కాకుండా సమయం వృథా అయ్యే పరిస్థితి వస్తుంది.
 • బ్రాంచ్‌తో పాటు కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. న్యాక్, అటానమస్, ఎన్‌బీఏ తదితర గుర్తింపులు ఉన్నాయో లేదో తల్లిదండ్రులు గమనించాలి.
 • అర్హత కలిగిన ఫ్యాకల్టీ, ఉత్తీర్ణతశాతం పరిగణలోకి తీసుకోవాలి.
 • ఏ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసినా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువులకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని గ్రహించి.. వాటికి కావాల్సిన నైపుణ్య శిక్షణను తొలి ఏడాది నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి.
 • పుస్తకాలకే పరిమితమయ్యే కళాశాలలు కాకుండా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇచ్చే విద్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి.
 • క్రమశిక్షణ, నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్న వాటిని పరిశీలించుకోవటం మంచిది.

 • ధ్రువపత్రాల పరిశీలన: ఈనెల 10వ తేదీతో పూర్తి
 • వెబ్‌ ఆప్షన్ల నమోదు : 8 నుంచి 12 వరకు
 • ఆప్షన్ల మార్పు : 13న
 • సీట్ల కేటాయింపు : 16న
 • కళాశాలల్లో రిపోర్టింగ్‌:  17 నుంచి 22 వరకు
 • తరగతుల ప్రారంభం: 19 నుంచి


ఉద్యోగమా? పీజీనా?

ఇంజినీరింగ్‌తో సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలు, ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం. ప్రతి సబ్జెక్టు క్రమం తప్పకుండా చదవాలి. ఇంజినీరింగ్‌ తర్వాత పీజీనా? ఉద్యోగమా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సన్నద్ధం కావాలి. అధ్యాపకులు చెప్పిన పాఠాలతో పాటు జర్నల్స్, మ్యాగజైన్, బ్లాగులు చూస్తూ సాంకేతికత సముపార్జన చేయాలి.

ఎమ్‌.హెచ్‌.ఎమ్‌.కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్, జేఎన్టీయూకే


అవి పరిగణనలోకి తీసుకోవాలి

విద్యార్థులు ఎంపిక చేసుకునే ముందు ఆ కళాశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. అక్కడ మనం ఎంచుకునే బ్రాంచ్‌కు గతేడాది ఏ ర్యాంకు వరకు వచ్చింది. అలాగే ప్రాంగణ ఎంపికలు క్రమం తప్పకుండా వస్తున్నాయా.. ఎటువంటి కంపెనీలు వస్తున్నాయి.. వార్షిక వేతనం ఎంత వరకు ఉంటుంది.. వంటి విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే ఓ అంచనాకు రావాలి.

సీహెచ్‌ చంద్రశేఖర్, మాజీ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, జేఎన్టీయూకే


మొదటి నుంచే  అవగాహన ఉండాలి

కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే స్వీయ సముపార్జన అలవాటు చేసుకోవాలి. ఆఖరి సంవత్సరంలో చేపట్టబోయే ప్రాజెక్టు గురించి మొదటిలోనే అవగాహన ఉండాలి. సీఎస్‌ఈ తర్వాత ఐటీ వంటి శాఖలకు మంచి డిమాండ్‌ ఉంది. వాటికీ సమాన అవకాశాలున్నాయి. అయితే ఏ బ్రాంచి తీసుకున్నా.. చదివే దాన్ని బట్టే అందులో విద్యార్థి రాణింపు ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్‌ తర్వాత గ్రూప్స్‌ను ఎంచుకొని ప్రజాసేవలో తరిస్తున్న వారు చాలామంది ఉన్నారు.

ఎన్‌.బాలాజీ, ప్రొఫెసర్, ఏపీఈఏపీ సెట్‌ హెల్ప్‌లైన్‌సెంటర్‌ సమన్వయకర్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని