లేని రోగాన్ని అంటగట్టి.. డబ్బులు డిమాండ్‌ చేసి..

లేని రోగాన్ని అంటగట్టి అధిక డబ్బులు వసూళ్లు చేయాలనుకున్నారు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ  కంటి వైద్యుడు. బాధితులు తెలిపిన వివరాలు... స్థానిక కొండయ్య చెరువు ప్రాంతానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని కంటి సమస్య ఉండటంతో గత నెల 28న పట్టణంలోని ఓ ప్రముఖ కంటి ఆసుపత్రికి వెళ్లారు.

Updated : 11 Jul 2024 06:13 IST

ఓ కంటి ఆస్పత్రిలో వైద్యుడి నిర్వాకం

విచారణకు కలెక్టర్‌ ఆదేశం

వివరాలు సేకరిస్తున్న  వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మహేశ్వరరావు  

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే : లేని రోగాన్ని అంటగట్టి అధిక డబ్బులు వసూళ్లు చేయాలనుకున్నారు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ  కంటి వైద్యుడు. బాధితులు తెలిపిన వివరాలు... స్థానిక కొండయ్య చెరువు ప్రాంతానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని కంటి సమస్య ఉండటంతో గత నెల 28న పట్టణంలోని ఓ ప్రముఖ కంటి ఆసుపత్రికి వెళ్లారు. వృద్ధురాలిని పరీక్షించి ఎడమ కంటికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యుడు సూచించారు. ఈ నెల 10న శస్త్ర చికిత్స చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 9న రక్త పరీక్షలు చేశారు. నివేదికలో వృద్ధురాలికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిందని తేల్చారు. దీంతో శస్త్ర చికిత్స చేయాలంటే ఈహెచ్‌ఎస్‌ సొమ్ముకు అదనంగా రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 77 ఏళ్లు ఉన్న వృద్ధురాలికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ రావడం ఏంటని బంధువులు వైద్యుడిని నిలదీయడంతో ఆయన దురుసుగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు. బయట ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయిస్తామని వృద్ధురాలిని తీసుకెళ్తుండగా ఆస్పత్రి సిబ్బంది ఆపి వృద్ధురాలికి మరోసారి పరీక్షలు చేశారు. దీనిలో ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. దీనిపై బాధితురాలి కుమారుడు వైద్యుడిని ప్రశ్నించగా ఇటువంటి సంఘటనలు సహజమేనని, కిట్‌లల్లో లోపాల కారణంగా ఇలా జరిగిందని వైద్యుడు బదులివ్వడం గమనార్హం. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారడంతో స్పందించిన కలెక్టర్‌ సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మహేశ్వరరావు బుధవారం వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. వారి నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని మహేశ్వరరావు పేర్కొన్నారు. ఆరోపణలు రుజువైతే సంబంధిత వైద్యుడిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని