అతివలిక ఐశ్వర్య లక్ష్ములు

సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించింది.

Updated : 11 Jul 2024 08:51 IST

డ్వాక్రా సంఘాలకు రుణ పండగ
అమలుకు సిద్ధమైన కార్యాచరణ
న్యూస్‌టుడే, పామూరు 

సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి పథకాల ద్వారా రూ.లక్షల్లో లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. లక్ష్యాలను పెంచుతూ వెలుగు ద్వారా మంజూరు చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రుణాల మంజూరుకు అర్హులైన సభ్యుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు.


గ్రేడింగ్‌ ఆధారం.. నగదు రహితానికి ప్రోత్సాహం...

సంఘాలకు కేటాయించిన గ్రేడింగ్‌ ఆధారంగా రుణ మంజూరు ఉంటుంది. గ్రేడ్‌-ఎలో ఉంటే రూ.75 లక్షలు, గ్రేడ్‌-బిలో ఉంటే రూ.65 లక్షలు, గ్రేడ్‌-సిలో అయితే రూ.55 లక్షలు, గ్రేడ్‌-డిలో ఉంటే రూ.45 లక్షలు మంజూరు చేస్తారు. సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. గత వైకాపా పాలనలో పొదుపు సొమ్ము జమ చేయడంలోనూ అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి కొత్త ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేలా మార్పులు చేసింది. గతంలో వీవో ఖాతాలో పొదుపు సొమ్ము జమ చేసేవారు. పలుచోట్ల పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి నగదు రహిత లావాదేవీలను అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే  వీవోఏలకు పేటీఎం పరికరాలు త్వరలో అందజేయనున్నారు.

సి.ఎస్‌.పురంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు రుణాల మంజూరుపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం


ఎస్సీ, ఎస్టీలకు మరింత ‘ఉన్నతి’...

ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేకుండా ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయనున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ సామాజిక వర్గాలకు రూపాయి కూడా అందించలేదు. జిల్లాలో వేల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ సభ్యులతో కూడిన సంఘాలు ఉన్నాయి. వీరికి ఇతరుల మాదిరిగానే వెలుగు, సామాజిక పెట్టుబడి నిధి, అంతర్గత రుణాలను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం సంఘాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల సభ్యుల వివరాల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.


24 గంటల్లోనే అందజేత...

గత వైకాపా ప్రభుత్వ హయాంలో బ్యాంకు లింకేజీ రుణాలు పొందాలంటే స్వయం సహాయక సంఘాల వారు అనేక ఇబ్బందులు పడేవారు. ఇక నుంచి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే రుణాలు అందజేస్తారు. ఒక్కో సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ రుణం మంజూరు చేయనున్నారు. జిల్లాలో రూ.2,203 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల మంజూరును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయమై స్త్రీనిధి పథకం ఏజీఎం ఎస్‌ చార్లెస్‌ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు విరివిగా రుణాలను అందించనున్నట్లు తెలిపారు. రూ.125 కోట్ల రుణాలు మంజూరు చేయాలనేది లక్ష్యమని, పాడి రైతులు, వ్యవసాయం, చిరు వ్యాపారులకు రుణాలను ఇస్తామని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలలోనే రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రుణాలపై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.


ఈ ఏడాది ప్రణాళిక

  • 24,500 మంది సభ్యులకు రూ.125 కోట్ల మేర స్త్రీనిధి రుణం అందించాలనేది ప్రణాళిక. 
  • ఇప్పటి వరకు ఒక్కో సభ్యురాలికి రూ.50 వేలుగా ఉన్న రుణ పరిమితిని రూ.లక్షకు పెంచారు. 
  • ఒక్కో సంఘానికి గతంలో రూ.2.50 లక్షల రుణం ఇస్తుండగా.. ప్రస్తుతం రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. 
  • గతంలో మాదిరిగా కాకుండా 145 రకాల జీవనోపాధులకు కూడా రుణాలందించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. 
  • వ్యాపార విస్తరణకు గతంలో రుణాలు తీసుకోవాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఇకపై 24 గంటల్లోనే వీవో(గ్రామ సంఘ సహాయకులు) లాగిన్‌ ద్వారా మంజూరు చేస్తారు. అనంతరం సభ్యురాలి వ్యక్తిగత ఖాతాలో నగదు జమ అవుతుంది. 

రూ. 125 కోట్ల మేర అందించేలా...

జిల్లాలోని  మండలాలు 38
స్వయం సహాయక సంఘాలు 32,375
ఆయా సంఘాల్లోని సభ్యులు: 3,23,780 మంది
గ్రామైఖ్య సంఘాలు 1,220 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు