Updated : 06 Dec 2021 21:54 IST

RGIA Hyderabad: ఎట్‌-రిస్క్‌ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!

హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. ఎట్‌ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయంలో పలు ఏర్పాట్లు చేశారు.

* ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా/ప్రయాణించగలిగేలా ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ ప్రీ-ఇమ్మిగ్రేషన్‌లో ప్రత్యేక కొవిడ్-19 టెస్టింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

* అన్ని అరైవల్ గేట్ల వద్ద థర్మల్ స్కానర్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

* ప్రయాణికుల సౌలభ్యం కోసం టెర్మినల్ అంతటా స్టిక్కర్లు, పోస్టర్లతో RT-PCR/ ర్యాపిడ్ PCR టెస్ట్‌ కేంద్రాల ఏర్పాటుపై సమాచారం ఇస్తున్నారు. ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసేందుకు పలు ప్రదేశాలలో సైనేజ్‌లు కూడా ఏర్పాటు చేశారు.

* ముందస్తు RT-PCR/ ర్యాపిడ్ PCR పరీక్షల బుకింగ్ ప్రక్రియను కూడా విమానాశ్రయ అధికారులు ప్రారంభించారు. ప్రయాణికులు తమ రాకకు ముందే టెస్ట్‌ కోసం బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్ www.hyderabad.aero లింక్‌ లేదా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ వెబ్‌సైట్ http://covid.mapmygenome.in లింక్‌ ద్వారా బుక్‌ చేసుకొనే వీలు కల్పించారు. RT-PCR పరీక్ష కోసం రూ.750 (నిరీక్షణ సమయం 6 గంటలు), ర్యాపిడ్ PCR పరీక్ష ధర రూ. 3,900 (2 గంటల నిరీక్షణ సమయం)గా ఉండనుంది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (GHIAL) సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ సమాచారం పొందుపరిచారు.

* RT-PCR/Rapid PCR పరీక్షను ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు నిర్వహించేలా GHIAL ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేసింది. ఆయా ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యూలు ఉంటాయి. వారికి రిజిస్ట్రేషన్ సమయం ఆదా కావడంతో పాటు నేరుగా పరీక్ష చేయించుకొనే వెసులుబాటు కలగనుంది.

* పరీక్ష ఫలితం కోసం వేచి ఉండే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులు కూర్చొనేందుకు వీలుగా తగిన సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫారెన్‌ ఎక్స్ఛేంజ్, పేమెంట్ కౌంటర్ల సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వెయిటింగ్ ఏరియాని సిద్ధం చేశారు.

* ప్రయాణికుల రాకపోకల సమయంలో డాక్యుమెంటేషన్ తనిఖీలో సహాయం చేసేందుకు తగినన్ని ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్‌లను (PSA) అదనంగా నియమించిన GHIAL యాజమాన్యం.. ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ (APHO), రాష్ట్ర ఆరోగ్య శాఖకు సహాయపడుతోంది.

* హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎట్‌ రిస్క్  దేశాల నుంచి వారంలో 12 విమానాలు ఉన్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ వారానికోసారి 3 డైరెక్ట్ ఫ్లైట్‌లను నడుపుతుండగా, ఎయిరిండియా లండన్‌కి వారానికోసారి 2 డైరెక్ట్ ఫ్లైట్‌లను నడుపుతోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సింగపూర్‌కు వారానికి మూడుసార్లు, స్కూట్ వారానికి 4 డైరెక్ట్ విమానాలను సింగపూర్‌కు నడుపుతోంది.

* డిసెంబర్ 5 నాటికి రిస్క్ ఉన్న దేశాల నుంచి మొత్తం 1,443 మంది ప్రయాణికులు వచ్చారు. 13 మంది ప్రయాణికులకు కొవిడ్‌- 19 పాజిటివ్ రాగా వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కి తరలించారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని