Nara lokesh: ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్‌

ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Published : 15 Jun 2024 15:36 IST

అమరావతి: ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్‌ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకుగల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బీ వినియోగం మీద సమగ్ర నోట్‌ ఇవ్వాలని సూచించారు. 

విద్యార్థులకు కిట్‌లు అందజేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వకపోవడం పట్ల లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వం కొనుగోలు చేసిన సైకిళ్లను వైకాపా ప్రభుత్వం పంపిణీ చేయకుండా మూలన పడేసిన నేపథ్యంలో వాటి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని