Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెనుముప్పు

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) (Godavari Express)కు పెను ముప్పు తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అంకుషాపూర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.

Updated : 15 Feb 2023 11:12 IST

బీబీనగర్‌: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) (Godavari Express)కు పెను ముప్పు తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అంకుషాపూర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం  రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌-1, ఎస్‌-4, జీఎస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని.. అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో  040-27786666 నంబరుతో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని వివిధ రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. బీబీనగర్‌ స్టేషన్‌లో విశాఖ-మహబూబ్‌నగర్‌ ప్రత్యేక రైలును ఆపేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్‌) స్పెషల్‌, దిబ్రూగఢ్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ రైళ్లను భువనగిరిలో నిలిపేశారు. ట్రాక్‌ మరమ్మతులు పూర్తయిన తర్వాత వీటిని పంపనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని