శాంతించిన గోదారమ్మ

గత వారం రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ...

Updated : 24 Nov 2022 16:29 IST

హైదరాబాద్‌: గత వారం రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 46.6 అడుగులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం  11.3లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. నీటి మట్టం తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు భద్రాచలం పరిసర ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు క్రమంగా తగ్గుతోంది. ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలకు ఇంకా రాకపోకలు కొనసాగడంలేదు. కూనవరం, చింతూరు, కుక్కునూరు మండలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

ధవళేశ్వరం వద్ద ..
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద కూడా గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 18.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 19.78 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని