Water Issue: పెద్దవాగు ప్రాజెక్టును జీఆర్‌ఎంబీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం

పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గోదావరి బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు సుముఖత తెలిపాయి. బోర్డు పరిధిలోకి తెలంగాణ రాష్ట్రంలోని ...

Updated : 12 Oct 2021 00:15 IST

హైదరాబాద్‌: పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గోదావరి బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు సుముఖత తెలిపాయి. బోర్డు పరిధిలోకి తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులను తీసుకురావాలని ఏపీ కోరగా.. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తీసుకోవాలని తెలంగాణ కోరింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టుల స్వాధీనం ఎక్కడా లేదన్న తెలంగాణ అధికారులు.. రాష్ట్రాలు అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయని స్పష్టం చేశారు. బోర్డు కేవలం.. పర్యవేక్షణ, నియంత్రణ మాత్రమే చూసుకుంటుందని ఛైర్మన్ చెప్పారని వెల్లడించారు. 

గెజిట్‌ అమలు సహా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశానికి బోర్డు సభ్యులు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుచేయాల్సి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మధ్య తరహా ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే విషయమై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి ఉపసంఘం ఇచ్చిన నివేదికపై బేటీలో చర్చించారు. ప్రయోగాత్మకంగా పెద్దవాగు ప్రాజెక్టు నుంచి గెజిట్‌ అమలు చేస్తామని గోదావరి బోర్డు తెలిపింది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు తగిన సమాచారంతో పాటు వివరాలు అందించడం సహా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరింది. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకునే విషయమై రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ కోరగా.. ఏపీ విభేదించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టుల స్వాధీనం అని ఎక్కడా లేదన్న తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ రాష్ట్రాలు అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయన్నారు.  

పెద్దవాగుతో పాటు తెలంగాణలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. లీవ్‌ పిరియడ్‌లో గోదావరి దిగువకు పెద్దగా జలాలు రావడం లేదని ఆ సమయంలో తెలంగాణ చెరువులకు నీటిని మళ్లిస్తోందని ఏపీ అధికారులు తెలిపారు. దీంతో ఏపీకి తాగునీటి సమస్య వస్తుందని, బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు శ్యామలరావు తెలిపారు. ఈ నెల 14 నుంచి  గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తున్న తరుణంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తున్నట్టు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు విషయమై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం సమావేశం కానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని