Top Ten News @ 5 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 02 Jul 2021 16:55 IST

1. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల్లేవ్‌: శ్రీనివాస్‌గౌడ్‌

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

2. కేసీఆర్‌.. సీమ కష్టాలు తెలుసన్నారు: సజ్జల

జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్‌ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారు. రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారు’ అని చెప్పారు.

kathi mahesh: చికిత్సకు ఏపీ ప్రభుత్వం సాయం
Ap News: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు

3. వారి సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాటం: రేవంత్‌

కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పారు. హైదరాబాద్‌ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

4. లాకోన్స్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

నగరంలోని సీసీఎంబీలో ఏర్పాటు చేసిన అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ ల్యాబోరేటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. లాకోన్స్ పేరుతో సీసీఎంబీలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన కేంద్రంలో నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్, సహాయక పునరుత్పత్తి ల్యాబ్‌లు ఉన్నాయి. లాకోన్స్‌ను పరిశీలించిన అనంతరం వన్య ప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో వెంకయ్య ముచ్చటించారు. ఆ తర్వాత లాకోన్స్ సిబ్బంది, సెంట్రల్ జూ అధికారులు సంయుక్తంగా రాసిన ‘ఇంట్రడక్షన్ టూ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్’ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

5. Supreme Court: మంత్రి గురించి ప్రధాని చూసుకుంటారు!

ఎవరైనా మంత్రి పనితీరు బాగోలేకపోతే, అలాంటి అంశాలను ప్రధానమంత్రి చూసుకుంటారు. అంతే కానీ, న్యాయస్థానాలు ఏమీ చేయలేవని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికారిక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కేంద్రమంత్రి వీకే సింగ్‌ తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) తోసిపుచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

6. వేర్వేరు డోసులపై కిరణ్‌ మజుందార్‌ షా ఏమన్నారంటే?

కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ల వేర్వేరు డోసులను తీసుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీటిపై అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బయోఫార్మా సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌పై స్పందించారు. రెండు వేర్వేరు డోసులను తీసుకోవడం వల్ల వైరస్‌ నుంచి మెరుగైన రక్షణ కలుగుతున్నట్లు ఇప్పటివరకూ వచ్చిన అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయని అన్నారు. 

Corona: 6 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

7. UPI transactions: యూపీఐ లావాదేవీల రికార్డ్‌!

యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. జూన్‌ నెలలో ₹5,47,373 కోట్ల విలువైన 2.8 బిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెల్లడించింది. ఇప్పటి వరకూ జరిగిన యూపీఐ లావాదేవీల్లో ఇదే అధికం కావడం గమనార్హం. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు దాదాపు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వస్తు, సేవలకు డిమాండ్‌ ఏర్పడిందనడానికి దీన్ని సంకేతంగా భావించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

8. రాహుల్‌జీ.. చదవలేరా? అర్థం చేసుకోలేరా? 

దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాల సరఫరా గురించి కేంద్రం చేసిన ప్రకటనను రాహుల్‌ అర్థం చేసుకోలేకపోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా టీకాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘జులై వచ్చింది.. వ్యాక్సిన్లు రాలేదు’’ అని పేర్కొన్నారు. దీనికి Wherearevaccines అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. అయితే ఈ ట్వీట్‌కు హర్షవర్ధన్‌ బదులిస్తూ.. రాహుల్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

9. Stock market: 4 రోజుల నష్టాలకు బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నాలుగు రోజుల నష్టాల పరంపరకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై ఆద్యంతం ఊగిసలాటలో పయనించిన సూచీలు ఇంధన, స్థిరాస్తి, టెలికాం, బ్యాంకింగ్‌ రంగాల నుంచి మద్దతు లభించడంతో చివర్లో పుంజుకున్నాయి. సెన్సెక్స్ చివరకు 166 పాయింట్ల లాభంతో 52,484 వద్ద.. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 15,722 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.77 వద్ద నిలిచింది.

10. Drone: పాక్‌లోని భారత హైకమిషన్‌ వద్ద డ్రోన్‌ 

జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై డ్రోన్‌ సంచరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ సంచారం భద్రత ఉల్లంఘన చర్యగా అభివర్ణించింది. గత ఆదివారం రెండు డ్రోన్లు జమ్ము వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే.

Missile: చైనా లక్ష్యంగా హైపర్‌సోనిక్‌ క్షిపణులు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని