Updated : 24 Jul 2021 17:16 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన హైకోర్టు.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని.. కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్‌ రీకాల్‌ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

హైకోర్టులో అశోక్‌గజపతిరాజు పిటిషన్‌

2. మాకు కావాల్సింది ఉద్యోగాలు.. గొర్రెలు, బర్రెలు కాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను అవమానిస్తున్నారంటూ మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తట్టా, పార, చీపుర్లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల ఉపాధి అవకాశాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. తమకు గొర్రెలు, బర్రెలు కాదని.. ఉద్యోగాలు కావాలంటూ నినదించారు. సరిగ్గా చదువుకోని వారంతా మంత్రివర్గంలో ఉన్నారని కానీ, చదువుకున్న వారు మాత్రం రోడ్లపై ఉన్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధ్వజమెత్తారు. 

3. రహదారిపై గోతులు పూడ్చుతూ తెదేపా నేతల నిరసన

రహదారులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో రహదారులపై ఉన్న గోతులను శనివారం తన అనుచరులతో కలిసి పూడ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెదేపా నాయకులు ఏలూరు-చింతలపూడి రోడ్డులో బాపిరాజుగూడెం పరిధిలోని రామచంద్రాపురంలో గోతులు పూడ్చే చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని గోతులు పూడ్చడానికి అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కొయ్యలగూడెంలో జరిగే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్లారు.

4. ఎందుకో రెండేళ్లకోసారి యుద్ధం చేయాల్సి వస్తోంది: ఈటల

తెరాస బీఫాంతోనే తాను గెలిస్తే మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారని భాజపా నేత ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆరో రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎందుకో రెండేళ్లకోసారి హుజూరాబాద్‌లో యుద్ధం చేయాల్సి వస్తోంది. 2008, 2010లో రాజీనామా చేస్తే గొప్ప మెజార్టీతో గెలిపించారు. ఆనాడు ప్రజలే నాకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారు. ఆరుసార్లు గెలిచినా నేను ధర్మంగానే గెలిచా. నాకు కుడి, ఎడమ ఎవరూ ఉండకూడదని చూస్తున్నారు. మీరు డబ్బు, అధికారాన్ని నమ్ముకుంటే.. నేను ప్రజలను నమ్ముకున్నా. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతోంది’’ అని ఈటల అన్నారు.

5. అన్నీ తెలిసి నాకెందుకు టికెట్‌ ఇచ్చారు?

నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలిపోతాయన్నారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తమిళనాడులో నమోదైన కేసుకు సీఎం జగన్‌, బాలశౌరి కారణమని పేర్కొన్నారు. తన గురించి అన్నీ తెలిసి పార్టీ టికెట్‌ ఎందుకు ఇచ్చారని నిలదీశారు.

6. సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు

సామాజిక వైద్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  2015లో జారీ అయిన జీవో  ప్రకారం... తమకు శిక్షణ ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు గత నెల 5న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. కానీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించడం లేదని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పారామెడిక్స్‌ శిక్షణ ఇవ్వాలన్న సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

7. 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను  కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కెరీర్స్‌ పోర్టల్‌ ద్వారా టాబ్యులేషన్ రిజిస్ట్రర్లను పాఠశాలలకు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 

8. భారత్‌లో టెస్లా విడుదలపై ఎలాన్‌ మస్క్‌ స్పందన!

కొన్ని నెలల క్రితం భారత్‌లో టెస్లా ప్రవేశంపై పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. టెస్లా తమ రాష్ట్రంలోనే సంస్థను స్థాపించనుందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఆ దిశగా పెద్దగా పురోగతి మాత్రం కనబడలేదు. అయితే, ఇటీవల ఈ విషయమై ట్విటర్‌లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ను ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. భారత్‌లో వీలైనంత త్వరగా టెస్లా కార్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. జాప్యానికి గల కారణాన్ని వెల్లడించారు.

9. కట్టెల మోపులు మోసిన చేతులతో వెండికొండనే ఎత్తింది

వెనకబడిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ నుంచి వచ్చింది మీరాబాయి చాను. 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఎక్కువగా మగపిల్లలతో తిరగడంతో ఆమెనంతా సరదాగా ఏడిపించేవారు. బడికెళ్లే వయసులో ఆమె విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. అప్పుడామెకు 12 ఏళ్లు. వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ.

మీరాబాయి చాను చెవి‘రింగుల’ కథ తెలుసా?

10. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌ ఇన్‌ కేరళ’ ప్యాకేజీ!

కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేలా వసతులు ఉంటాయో, లేదో అని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని