Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 08 Aug 2021 16:57 IST

1. నల్సా యాప్‌ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా నల్సా మొబైల్‌ యాప్‌ సేవలను జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. పోలీస్‌ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఠాణాల్లో ఇప్పటికీ మానవహక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమన్నారు. కస్టోడియల్‌ టార్చర్‌ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు

2. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కింద వాహనాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్‌

తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం’ కింద వికలాంగులకు ప్రకటించిన వాహనాలను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. తన పుట్టిన రోజుకు ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం డబ్బు వృథా చేయొద్దని కోరిన కేటీఆర్‌.. గత ఏడాది నుంచి గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు. గతేడాది సిరిసిల్లలో ఆరు అంబులెన్స్‌లను దానం చేసిన ఆయన.. ఈ ఏడాది 130 స్కూటర్లను వికలాంగులకు అందించారు.

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలు

3. అమరావతి పేరు వింటేనే జగన్ వణికిపోతున్నారు: లోకేశ్‌

అమరావతి పేరు వింటేనే ఏపీ సీఎం జగన్ రెడ్డి వణికిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అణచివేతకి ఎదురొడ్డి నిలిచిన ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం.. మహోద్యమంగా మారిందన్నారు. జై అమరావతి పోరాటం ప్రారంభించి 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరైంది కాదని మండిపడ్డారు. వ్యాన్లలో కుక్కి రైతుల కాళ్లు విరగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసులు విచక్షణ లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 

4. రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు

తెలంగాణ రాష్ట్ర సభ్యులు బోర్డు సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోమారు విడివిడిగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. 

5. రేవంత్‌రెడ్డితో విభేదాల్లేవు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు వెల్లడించారు. చౌటుప్పల్‌ రాజీవ్‌ భవన్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన అని.. హిట్లర్‌ బతికి ఉంటే కేసీఆర్‌ను చూసి విలపించేవారని ఎద్దేవా చేశారు. కేవలం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకే ఆయన సీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

6. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఐదుగురి అరెస్ట్‌.. ఇద్దరు వైకాపా నేతలపై సీబీ‘ఐ’!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. శనివారం పి.ఆదర్శ్‌, ఎల్‌ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్‌ చేయగా.. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని కువైట్‌ నుంచి వస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. శనివారం అరెస్టయిన ఆదర్శ్‌, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నయోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

7. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి.. దండోరా మోగించబోతున్నాం

తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్యంలో ఇంద్రవెల్లిలో సోమవారం తలపెట్టిన భారీ బహిరంగసభను విజయవంతం చేసేందుకు నేతలు కృషి చేస్తున్నారు. కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో.. దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 9న  సాయంత్రం 3 గంటలకు ఇంద్రవెల్లిలో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 

మాజీ నేత.. 4 ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలానికి ఎసరు

8. ప్రయోగాత్మకంగా హైడ్రోజన్‌ ఇంధనంతో రైళ్ల పరుగు

ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను భారతీయ రైల్వే కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటిదాకా జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. కాలుష్య రహిత హరిత రవాణా విధానంగా దీన్ని చెప్పుకోవచ్చు. హరియాణాలోని సోనిపట్‌ - జింద్‌ మార్గంలో 89 కిలోమీటర్ల మేర ఉత్తర రైల్వే నడిపే డెమూ రైలుకు హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను వినియోగించనున్నట్లు సంబంధిత మంత్రిత్వశాఖ శనివారం ఓ ప్రకటన వెలువరించింది. 

9. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ఫలితాలు ఎలా ఉన్నాయి..?

కరోనా వైరస్‌ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు భిన్న రకాల టీకాలను కలిపి ఇచ్చే (మిక్సింగ్‌) విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌పై బ్రిటన్‌లో అధ్యయనాలు జరుగుతుండగా.. భారత్‌లోనూ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌పై పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా వేర్వేరుగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను (ఒక్కో డోసు చొప్పున) తీసుకోవడం సురక్షితమని భారత వైద్య పరిశోధనా మండలి చేపట్టిన (ICMR) అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

10. ఐదో రోజు ఆట ఆలస్యం.. వర్షం కారణంగా అంతరాయం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు మైదానంలో వర్షం కురుస్తోంది. దాంతో ఆట కొద్దిగా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. చివరి రోజు టీమ్‌ఇండియా విజయానికి 157 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రోహిత్‌ శర్మ(12), చెతేశ్వర్‌ పుజారా(12) ఉన్నారు. చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఇక కేఎల్‌ రాహుల్‌(26) శనివారం మూడో సెషన్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లాండ్‌ 303 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 95 పరుగులు కలుపుకొని లక్ష్యం ఇప్పుడు 209 పరుగులుగా నమోదైంది.

సరిహద్దుల్లోనే కాదు.. ఒలింపిక్స్‌లోనూ భారత్‌ను గెలిపిస్తున్న సైన్యం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని