Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 16 Oct 2021 17:22 IST

1. విద్యుత్‌ కోతలపై ప్రచారం అవాస్తవం: ఇంధన శాఖ

ఏపీలో విద్యుత్‌ కోతలు ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఇంధన శాఖ స్పందించింది. అదంతా దుష్ప్రచారమేనని స్పష్టంచేసింది. దసరా తర్వాత కరెంటు కోతలు ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలు విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని స్పష్టంచేసింది. బొగ్గు నిల్వ, సరఫరా అంశాలు విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలిపింది. సంక్షోభంలోనూ నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు డిస్కంలు కృషిచేస్తున్నాయంది.

2. కారెక్కనున్న మోత్కుపల్లి.. ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాస తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం (ఈ నెల 18న) ఆయన కారెక్కనున్నారు. మోత్కుపల్లి తెరాసలో చేరే ప్రయత్నాలు గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. దళితబంధుపై ముఖ్యమంత్రి నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అప్పట్నుంచే తెరాసలో చేరతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇటీవల శాసనసభలోనూ దళితబంధుపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటే ఉన్నారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని అప్పట్లో అందరూ భావించారు. 

3. ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది: నారా లోకేశ్

ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్‌ కోతల గురించి ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరో వైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సీఎం జగన్‌లో చలనం లేదు’’ అని విమర్శించారు. 

4. హైదరాబాద్‌లో 300 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. నిందితుల నుంచి 300కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మూసారాంబాగ్‌, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి 10 బస్తాల్లోని 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందన్నారు.

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు
రాయ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పేలుడు.. జవాన్లకు గాయాలు

5. ఆ చట్టాల ఆమోదానికి అందరినీ నరకయాతన పెట్టారు: సోనియా

దేశ రాజధానిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలతో పాటు దేశంలోని అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించి ఏడాదైంది. రైతులు, రైతు సంఘాల ఆందోళన కొనసాగుతోంది. కొన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనానికే ఈ మూడు నల్లచట్టాలు తీసుకొచ్చారు. నల్ల చట్టాల ఆమోదానికి అందరినీ నరకయాతన పెట్టారు. నిరసనలతో రైతులు ఎంతో నష్టపోయారు. లఖింపుర్‌ ఖేరీ ఘటన భాజపా మనస్తత్వాన్ని బయటపెట్టింది. రైతుల పట్ల భాజపాకు ఎలాంటి ఆలోచన ఉందో దీనిద్వారా తెలిసింది’’ అన్నారు.

6. 10.07కోట్ల మంది భారతీయుల వద్ద క్రిప్టో కరెన్సీ!

ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్‌లోనూ 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్‌బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్రం ‘క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ’ బిల్లును సిద్ధం చేస్తోంది.

7. తొలిసారి తేజస్‌ యుద్ధవిమానాలు ఒకే క్రమంలో వెళ్లే దృశ్యాన్ని చూశారా?

గాలిలో పక్షులు ఒకే క్రమంలో వెళ్తుంటేనే తదేకంగా చూస్తుంటాం. అలాంటిది యుద్ధవిమానాలు ఎగురుతుంటే.. చూపు తిప్పుకోగలమా! తాజాగా భారత వాయుసేన(ఐఏఎఫ్‌) మొదటిసారిగా 14 తేజస్ యుద్ధ విమానాలు ఓ నిర్దిష్ట క్రమంలో వెళ్లేలా ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఈ ఫొటోలను ఐఏఎఫ్ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారాయి.

8. ఈ నగరాల్లో ఇల్లు కొంటే ఆనందమే మరి!

ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుగోలు చేసి హాయిగా స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ఏ ప్రాంతంలో అన్ని విధాలుగా అనువుగా.. సంతోషకర వాతావరణం ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. ఇల్లు కొనుగోలు చేసి కొన్ని రోజులు నివసిస్తే తప్ప.. అక్కడ ఆనందంగా ఉండగలమా లేదా అనేది తెలుకోలేం. అయితే, ఇదే విషయంపై ఓ సర్వే సంస్థ పరిశోధన చేసి ఏ ఇబ్బంది పడకుండా.. సంతోషంగా ఇల్లు కొనగలిగే టాప్‌ 20 ఆనంద నగరాల జాబితాను రూపొందించింది. వీటిలో ఐదు నగరాలు భారత్‌లోనే ఉండటం విశేషం.

9. భారత దిగ్గజ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?

నాటి ప్రధాని  పీవీ నర్సింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు భారతదేశ రూపురేఖల్నే మార్చేశాయి. అప్పటి వరకు లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థతో కునారిల్లుతున్న దేశీయ ప్రైవేటు రంగం.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన అనేక కంపెనీలు వ్యాపారంలో భారతదేశ సత్తా ఏంటో చాటాయి. రూ.లక్షల కోట్ల సంపదను సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగాయి. ముఖ్యంగా ఐటీ సేవల్లో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. అయితే, 2008లో ఆర్థిక సంక్షోభం, 2019 కరోనా సంక్షోభం వల్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి కొంతమేర కుంటుపడింది. అయినప్పటికీ.. బలమైన పునాదుల కారణంగా వేగంగా కోలుకున్నాయి. అయితే, కొన్ని సంస్థలు కరోనా సంక్షోభాన్ని సైతం తట్టుకొని రాణించాయి. కొన్ని కంపెనీలు గణనీయ స్థాయిలోనే లాభాల్ని ఆర్జిస్తున్నాయి.

10. శార్దూల్‌ ఠాకూర్‌కు బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. జీవితంలో మర్చిపోలేడు

ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే పుట్టినరోజు బహుమతి అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఐపీఎల్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టు నాలుగోసారి టైటిల్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం శార్దూల్‌ మాట్లాడుతూ ఇదే తనకు అత్యుత్తమ బర్త్‌డే గిఫ్ట్‌ అని సంబరపడ్డాడు. చెన్నై ఈ మ్యాచ్‌ గెలిచిన కాసేపటికే ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ 30వ జన్మదినంలోకి అడుగుపెట్టాడు.

మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని