Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 11 Oct 2021 09:09 IST

1. బస్సెక్కి.. రైలెక్కి.. వచ్చేత్తపా

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతోండటం.. టీకాల పంపిణీ జోరందుకోవటం..వంటి పరిణామాలు పర్యాటకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కొవిడ్‌ భయంతో మొన్నటివరకు ఒకట్రెండు రోజులు, దగ్గర ప్రాంతాలకు వెళ్లివచ్చిన రాష్ట్రవాసులు.. నేడు కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, గుజరాత్‌, గోవా, కర్ణాటక, తమిళనాడు వంటి దూరప్రాంతాలకూ ఉల్లాసంగా తరలివెళుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్యరాష్ట్రాల్ని చుట్టేసి వస్తున్నారు. వారం, పదిరోజుల యాత్రలకు వెళుతున్నవారిలో 70శాతం పైగా సీనియర్‌ సిటిజన్లే ఉంటున్నారని ఐఆర్‌సీటీసీ వర్గాలు చెబుతుండటం ఆసక్తికర పరిణామం. కశ్మీర్‌, మేఘాలయ వంటి ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారిలో యువకులు, మధ్యవయస్కులు అధికంగా ఉంటున్నారు.

2. దేశం చూపు.. సింగరేణి వైపు

దేశంలో బొగ్గుకు డిమాండు పెరగడంతో సింగరేణి కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాలు సైతం సింగరేణి బొగ్గును అడుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల విద్యుత్కేంద్రాలు అదనంగా బొగ్గు పంపాలని సింగరేణిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్కసారిగా గిరాకీ పెరిగినా, అందుకు తగ్గట్టు సింగరేణి సరఫరా చేయలేని స్థితి. కొత్త గనుల తవ్వకాలు, విస్తరణ, ఆధునికీకరణ తదితర అంశాల్లో జాప్యం వల్ల సంస్థ ఉత్పత్తిని పెంచలేకపోతోంది. విద్యుత్తు సంక్షోభ నివారణకు వీలైనంత అదనపు బొగ్గు పంపాలని సింగరేణి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

డెంగీ విజృంభణ

3. పల్లెల్లో కోతలు

ఏపీలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. వాతావరణం కొంత చల్లబడినట్లే అనిపించినా గత ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా 20 శాతం పెరిగింది. దీనికితోడు దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లు సైతం ఇదే సమస్యతో కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ పెరగటంతో యూనిట్‌ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కొందామన్నా దొరకటం లేదు. ముఖ్యంగా పీక్‌ డిమాండ్‌ (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల) సమయంలో విద్యుత్‌ దొరకటం కష్టంగా ఉంది. లోడ్‌ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి ఈ సమయంలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు రేడియల్‌ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు.

4. సీటు బెల్టు పెట్టేద్దాం

రాజధాని నగరంలో అతి వేగం.. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్పు కారు డ్రైవర్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, స్పీడ్‌ లేజర్‌ గన్‌లు వారిపై ప్రభావం చూపుతున్నాయి. సీటు బెల్టు పెట్టుకోకపోతే సీసీ కెమెరాల ద్వారా ఈ-చలాన్‌ వస్తుండటంతో కార్లు నడిపే దాదాపు 90శాతం మందిలో మార్పు వచ్చిందని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుతోందని చెబుతున్నారు. ఇటీవల మెట్రో నగరాల్లో ఈ పరిస్థితిపై వారు విశ్లేషించారు. ప్రమాదాల నియంత్రణలో హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉందని తేలింది.

5. Azadi Ka Amrit Mahotsav: లండన్‌లోనే కుంపటి పెట్టి..

స్వాతంత్య్రం కోసం భారత్‌లో జాతీయోద్యమానికి తోడు విదేశాల్లో జరిగిన ప్రయత్నాలూ తక్కువేం కాదు. బ్రిటన్‌కు వ్యతిరేకమైన జర్మనీ, స్విట్జర్లాండ్‌, జపాన్‌లు వేదికగా అనేక మంది ఉద్యమాలకు ప్రయత్నించారు. కానీ ఏకంగా బ్రిటిషర్ల గడ్డ లండన్‌ నుంచే ఉద్యమానికి ఊపిరిలూదిన ధీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ! సావర్కర్‌లాంటి హిందూవాదుల నుంచి రామన్‌ పిళ్లైలాంటి సామ్యవాద విప్లవకారుల దాకా అందరికీ ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్‌ హౌసే ఆశ్రయం ఇచ్చింది. సిపాయిల తిరుగుబాటు సంవత్సరం (1857)లో గుజరాత్‌లోని కచ్‌లో జన్మించిన కృష్ణవర్మ ముంబయిలోని విల్సన్‌ హైస్కూల్‌లో చదివారు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించారు.

6. MAA Elections: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడిగా కథానాయకుడు మంచు విష్ణు ఎన్నికయ్యారు. సాధారణ ఎన్నికల్ని తలపించేలా... ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగిన ఎన్నికల సమరంలో సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది, అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. ఇతర ఆఫీస్‌ బేరర్‌ పదవుల్లోనూ ఎక్కువగా విష్ణు ప్యానెలే సొంతం చేసుకుంది. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడిన రఘుబాబు... నటి జీవితపై 27 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, కోశాధికారిగా శివబాలాజీ 67 ఓట్ల తేడాతో నాగినీడుపై గెలుపొందారు.

MAA Elections: ఎన్నికల ‘మా’స్‌

7. Power Crisis: కరెంటు సంక్షోభం రానే రాదు

దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం ముంచుకురాబోతోందని చెప్పడంలో అర్థం లేదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల డిమాండ్‌కు తగ్గట్టు నల్లబంగారం అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాల్లో 72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతాయని తెలిపింది. కోల్‌ ఇండియా వద్ద 4 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. వాటిని విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని చెప్పింది. కాబట్టి అనవసర భయాందోళనలు వద్దని చెప్తూ బొగ్గుశాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

8. మోదీ నిర్ణయాలు ఏకపక్షం కాదు

రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీలాంటి శ్రోతను తానెప్పుడూ చూడలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మంచి చెడులను విని, ప్రజాస్వామ్యయుతంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకొనే శక్తి ఆయనకు తప్ప మరొకరికి లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నడూ లేనంత ప్రజాస్వామ్యయుతంగా కేంద్ర మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం మోదీ తీసుకున్నన్ని సంక్షేమ చర్యలు కానీ, ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు చేపట్టినన్ని సంస్కరణలు కానీ దేశంలో ఎవరూ తీసుకురాలేదన్నారు.

9. సౌర విద్యుత్తుపై రిలయన్స్‌ రూ.8,645 కోట్లు

2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులు ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఉన్న ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్‌ఈసీ సోలార్‌ను 771 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో కొనుగోలు చేసిన సంస్థ, దేశీయంగా స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 40 శాతం వాటాను రూ.2845 కోట్లకు కొంటున్నట్లు తెలిపింది. ఆర్‌ఐఎల్‌ కొత్తగా ప్రారంభించిన ఇంధన సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) 771 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5,800 కోట్లు) వెచ్చించి చైనా నేషనల్‌ బ్లూస్టార్‌ (గ్రూప్‌) కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న ఆర్‌ఈసీ సోలార్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది.

10. IPL 2021: చెన్నై.. తొమ్మిదోసారి

సూపర్‌కింగ్స్‌దే సంబరం. మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై.. తొమ్మిదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉతప్ప దంచుడు.. రుతురాజ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.. తనలోని ఒకప్పటి ఫినిషర్‌ను గుర్తుకు తెస్తూ ఒత్తిడిలో ధోని మెరుపులు.. వెరసి ఉత్కంఠ పోరులో పైచేయి సాధించింది. చెన్నై అనుభవాన్నంతా ఉపయోగిస్తూ క్వాలిఫయర్‌-1లో కుర్ర దిల్లీని మట్టికరిపించింది. ఓడిపోయినా ఫైనల్‌ చేరేందుకు దిల్లీకి ఇంకో ఛాన్సుంది. కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌లో విజేతను పంత్‌ జట్టు ఢీకొంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని