Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 22 Aug 2021 20:55 IST

1. వాహనం జప్తు చేసే అధికారం ఉంది: సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీస్‌

పెండింగ్‌ చలానాలున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి చట్ట ప్రకారం ట్రాఫిక్‌ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు ఆదేశించినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఈనెల 11న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ... వాహనదారుడు వారం రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే విడుదల చేయాలని సూచించిందని తెలిపారు.

2. శ్రీశైలం జలాశయంలో హైడ్రో గ్రాఫిక్‌ సర్వే

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్‌ సర్వే జరుగుతోంది. ముంబయి నుంచి వచ్చిన 12 మంది నిపుణులు హైడ్రో గ్రాఫిక్‌కు సంబంధించిన పరికరాలతో సర్వే  చేపట్టారు. వరదల వల్ల జలాశయంలో ఎంత పూడిక చేరిందో గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు.

3. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు బండి సంజయ్‌ ప్రకటించారు. పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నట్టు తెలిపారు. మాజీ సైనికాధికారులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. కల్యాణ్‌సింగ్‌ మృతి పట్ల బండి సంజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారని... ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

4. శంషాబాద్‌ నుంచి మాలేకు విమాన సర్వీసులు పునఃప్రారంభం

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మాల్దీవులలోని మాలేకు  విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఇండిగో విమాన సంస్థ సర్వీసును ప్రారంభించింది. ఇండిగో విమానం 6E 8108 మధ్యాహ్నం 2.20 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మాలేకు ఆగస్టు 22 నుంచి వారానికి మూడుసార్లు విమానాలను నడపనున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

5. తాలిబన్ల తరపున రంగంలోకి రష్యా..

అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ లోయలో తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రతిఘటన దళాలతో చర్చలు జరపడంలో అవసరమైతే చురుకైన పాత్ర పోషించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కాబుల్‌లోని రష్యా రాయబారి దిమిత్రి జిర్నోవ్‌ తెలిపారు. తాము ఇచ్చిన డీల్‌పై పంజ్‌షీర్‌లోని దళాలతో చర్చించాలని తాలిబన్లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు రక్తపాతం కోరుకోవడంలేదని రష్యా రాయబారి వెల్లడించారు.

6. ఈ బిట్‌కాయిన్‌ యాప్స్‌తో జాగ్రత్త సుమా..! 

బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలనే యూజర్స్ లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిట్‌కాయిన్‌ కొనుగోలుకు సంబంధించి యాప్‌లను రూపొందించి అమాయకులైన వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన గూగుల్ 8 ప్రమాదకరమైన బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ, క్రిప్టో మైనింగ్ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్స్‌ కూడా తమ ఫోన్ల నుంచి సదరు యాప్స్‌ని వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.

7. ఇన్ఫోసిస్‌ సీఈఓకు కేంద్ర ఆర్థిక శాఖ సమన్లు!

ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌కు కేంద్ర ఆర్థికశాఖ సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముందు హాజరు కావాలని తెలిపింది. నిన్నటి నుంచి ఐటీ పోర్టల్‌ అందుబాటులో లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

8. ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2’ సందడి వచ్చే ఏడాదే..!

పరిస్థితులు బాగుంటే ఇప్పటికే సందడి చేయాల్సిన చిత్రాల్లో ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2’ ఒకటి. జులై 16న విడుదల కావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్ర విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. కొత్త విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. యశ్ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న సినిమా ఇది.

9. ఆడపిల్లల ఆధారాలు కనపడకుండా పాఠశాల రికార్డులు కాల్చేశారు!

తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని జనం భయం గుప్పిట్లో బతుకున్నారు. తాలిబన్ల గత పాలనలో చేసిన ఆరాచకాలను గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. తాజాగా తాలిబన్ల చెర నుంచి ఆడపిల్లలను రక్షించడానికి ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు రికార్డులు తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. షబానా బసిజ్-రసిక్ అనే మహిళ అఫ్గాన్‌లో ఆల్-గర్ల్స్ బోర్డింగ్ స్కూల్‌ నిర్వహిస్తున్నారు.

10. ఇంగ్లాండ్‌ పుంజుకోవాలంటే అద్భుతం జరగాలి: సన్నీ

ప్రస్తుతం టీమ్‌ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు కోలుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే రెండో టెస్టులో టీమ్‌ఇండియా మానసికంగా ఎంతో దృఢత్వం సంపాదించిందని చెప్పాడు. దాంతో ఆతిథ్య జట్టు పుంజుకోవడం కష్టమని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని, ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారు అవ్వొచ్చని తెలిపాడు. అందుకు అద్భుతం జరగాలన్నాడు.

ఫుట్‌బాల్‌ దిగ్గజం షాహిద్‌ హకీమ్‌ కన్నుమూత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని