Top Ten News @ 9 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 10 Jul 2021 21:09 IST

1. ఏపీలో మరోసారి ‘తెలుగు’ వివాదం

తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భాషాభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గతంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా.. తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు మరోసారి స్పందించాయి.

2. అవకాశవాదులకు స్థానం లేదు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను అవమానించారని.. తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్‌ వారసులమని చెప్పుకుంటూ కొంత మంది రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.

3. జగన్‌.. ఎందుకు దిల్లీ వెళ్లడం లేదు: సోమిరెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించడంలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాయలసీమకు రావాల్సిన శ్రీశైలం నీటిని తెలంగాణ ప్రభుత్వం తోడేస్తుంటే.. జగన్‌ చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నారని ఆక్షేపించారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మిఠాయిలు తినిపించుకున్నారని.. జలవివాదం విషయంలో ఎందుకని సామరస్యంగా చర్చించుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రితో చర్చించాలని డిమాండ్‌ చేశారు.

సుజనా అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

4. లేటరైట్‌ వివాదంపై స్పందించిన ప్రభుత్వం

విశాఖ జిల్లా నాతవరం మండలంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారంటూ నిన్న తెదేపా నేతలు ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్రమంగా నిర్మించిన రహదారులను పరిశీలించి నిరసన చేపట్టారు. దీనిపై ఏపీ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. లేటరైట్‌ తవ్వకాల్లో ప్రస్తుతం ఎలాంటి అక్రమాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

5. Q1 results: 132% పెరిగిన డీమార్ట్‌ లాభాలు

రిటైల్‌ చైన్‌ డీమార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.5,032 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన కార్యకలాపాల ఆదాయం రూ.3,833.23 కోట్లతో పోలిస్తే ఇది 31శాతం ఎక్కువ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.50 కోట్లుగా నమోదైన నికర లాభాలు ఈసారి 132 శాతం ఎగబాకి రూ.115 కోట్లకు చేరాయి.

6. ఒంటెపై ప్రయాణించి.. పాఠాలు బోధించి..

ఏదైనా తలుచుకుంటే అసాధ్యమైనా సరే.. సుసాధ్యం చేస్తామని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యనే విద్యార్థులకు మార్గమైంది. అయితే కొందరు విద్యార్థులకు సాంకేతిక లోపాలు, డిజిటల్‌ వసతుల కొరత, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పినా అర్థం కాకపోవడం..తదితర సమస్యలు తలెత్తాయి. చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నా  విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలని సంకల్పించారు రాజస్థాన్‌లోని బార్‌మేడ్‌ జిల్లాకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. 

7. కొత్త మంత్రివర్గంలో 42% మందిపై క్రిమినల్‌ కేసులు

ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. కాగా.. నూతన మంత్రిమండలిలో 42శాతం అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులున్నాయట. వీరిలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) తన నివేదికలో వెల్లడించింది. 

8. సెకండ్‌ వేవ్‌ ఇంకా పోలేదు.. అలా చేయొద్దు: కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఇంకా ముగిసిపోలేదని కేంద్రం మరోసారి హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని విస్మరించొద్దని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన దేశంలోని హిల్‌ స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తికి సంబంధించి  తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

Kappa Variant: యూపీలో ‘కప్పా’ కేసు

9. kathi mahesh: కత్తి మహేశ్‌ కన్నుమూత

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

10. Delhi: ₹2,500 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. దేశ రాజధాని దిల్లీలో ₹2,500 కోట్లు విలువచేసే 354 కిలోల హెరాయిన్‌ను దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ముంబయి నుంచి వచ్చిన ఓ కంసైన్‌మెంట్‌ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో హెరాయిన్‌ బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారి నీరజ్‌ ఠాకూర్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని