Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని టాప్‌ టెన్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated : 15 Oct 2021 21:04 IST

1.  హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం డెల్టా బారిన పడాల్సిందే.. లేదా..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్‌ ఇమ్యూనిటీ (Herd Immunity) దేశ రాజధాని దిల్లీలో చాలా కష్టమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్‌ రెండో దశ దిల్లీని కకావికలం చేసిందని.. అక్కడ హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు డెల్టా బారిన పడటం లేదా.. బూస్టర్‌ డోసు తీసుకోవడం మాత్రమే మార్గమమని స్పష్టం చేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, కోపెన్‌హాగెన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సహా మరికొందరు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.

2ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉచిత గృహవసతి గడువు పొడిగింపు

ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి పూర్తిగా తరలిరాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్‌ వరకు (ఆరు నెలలపాటు) పొడిగించాలని సీఎం జగన్‌ ఆదేశించినట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారులు సమాచారం పంపినట్టు వెల్లడించారు. ఈనెలాఖరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వసతి గడువు ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పోటీ చేయడం ఖాయం

3. ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. లఖింపుర్‌ తరహా ఘటన 

పండగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల లఖింపుర్‌ ఖేరి ఘటనలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన తరహాలోనే ఇక్కడి జశ్‌పుర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఓ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. జశ్‌పుర్‌ పత్తల్‌గావ్‌కు చెందిన గ్రామస్థులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వారిపైనుంచి దూసుకెళ్లింది. నిందితులు అంతటితో ఆగకుండా అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గౌరవ్ అగర్వాల్(21) దుర్మరణం పాలయ్యాడు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.

4. యూకేలో ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాకం.. 43 వేల మందికి తప్పుడు కొవిడ్‌ ఫలితాలు!

యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్‌ హాంప్టన్‌లో ఉన్న ఆ ల్యాబ్‌లో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను నిలిపివేసినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ(యూకేహెచ్‌ఎస్‌ఏ) శుక్రవారం ప్రకటించింది. ‘ఆ ల్యాబ్‌లో దాదాపు నాలుగు లక్షల నమూనాలు పరీక్షించారు. అందులో చాలావరకూ నెగెటివ్‌ వచ్చాయి. కానీ, వాటిలో 43 వేల వరకు తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు ఉండవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 12 మధ్య ఈ రిజల్ట్స్‌ వచ్చాయి’ అని పేర్కొంది.

5. నా అంచనా ప్రకారం ఆ జట్టుదే ఐపీఎల్‌ టైటిల్‌: మైఖేల్‌ వాన్‌

చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) తుదిపోరు జరుగుతోంది. టాస్‌ నెగ్గిన కేకేఆర్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆయా ఫ్రాంచైజీ అభిమానులు తమ జట్టే గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. క్రికెట్‌ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు తమదైన అంచనాలతో ఏ జట్టు విజయం సాధిస్తుందో చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ కూడా ఏ జట్టు ట్రోఫీని గెలుచుకోనుందో ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌లో విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపాడు. కేకేఆర్‌పై సీఎస్‌కే గెలిచి నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోనుందని వాన్ జోస్యం చెప్పాడు.

ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

6. ఎట్టకేలకు బాటసింగారంలో పండ్లమార్కెట్‌ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం లాజిస్టిక్‌ పార్క్‌లో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసిన దృష్ట్యా కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని మంత్రి కోరారు. 

7. పండగ స్పెషల్‌.. కొత్త కార్లు... భలే బైక్‌లు!

దసరా పండగ కదా... మార్కెట్‌లోకి కొత్త కార్లు, బైక్లు వచ్చాయి. పండగ రోజులు కదా కొత్త వాహనం ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి. కియా ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సోనెట్‌ మోడల్‌లో మొదటి వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. నాలుగు పవర్‌ట్రైన్‌ సదుపాయాల్లో, మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లతో ఈ వాహనం లభించనుంది. పెట్రోల్‌ వెర్షన్‌లు రూ.10.79 లక్షలు, రూ.11.49 లక్షలతో, డీజిల్‌ వేరియంట్‌లు రూ.11.09 లక్షలు, రూ.11.89 లక్షల ధరలతో లభిస్తాయి.

8. మృతుడు రోజుకూలీ.. ముగ్గురు పిల్లలు 12 ఏళ్ల లోపువారే..!

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తోన్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన వేదిక వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. కాగా, ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోస్టుమార్టం జరుగుతోంది. మా వద్ద అనుమానితుల వివరాలున్నాయి. త్వరలో అరెస్టు చేయబోతున్నాం’ అని హరియాణా పోలీసు అధికారి సందీప్ ఖిర్వార్ వెల్లడించారు.

9.  చెన్నైకి మద్దతిచ్చిన వార్నర్‌.. పోస్ట్‌ డిలీట్‌.. ఎందుకిలా చేశాడు?

ఐపీఎల్‌ 2021 ఫైనల్‌లో గెలిచి నాలుగోసారి టైటిల్‌ గెలవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌, రెండోసారి ధోనీసేనకు షాకివ్వాలని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు అభిమానులు సైతం తుదిపోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టగా ఈసారి ఫైనల్‌కు చేరడంతో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్టు చేసి.. వెంటనే దాన్ని డిలీట్‌ చేశాడు. 

10. టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సిద్ధమైందా?

మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చేశాయి. ఉదయం రామ్‌చరణ్-గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను ప్రకటించగా, మధ్యాహ్నం మరో క్రేజీ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ‘కె.జి.యఫ్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమా రెండో భాగం కూడా పూర్తయింది. ఇక ప్రభాస్‌ కథానాయకుడిగా ‘సలార్‌’ ఇప్పటికే సెట్స్‌పైన ఉంది. కాగా, ప్రశాంత్‌ నీల్‌ తెలుగులోనే మరో చిత్రం చేయనున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 

‘దసరా స్పెషల్‌’.. సినీతారలు పంచుకున్న ఈ పోస్టుల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని