ఫాస్టాగ్‌ గడువును పొడిగించిన కేంద్రం

ఫాస్టాగ్‌ను ఉపయోగించి కేంద్ర రహదారులపై టోల్‌ ఫీజును చెల్లించే గడువును కేంద్రం మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది.

Updated : 31 Dec 2020 17:02 IST

దిల్లీ: ఫాస్టాగ్‌ను ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్‌ ఫీజును చెల్లించే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. పూర్తి స్థాయి ఫాస్టాగ్‌ చెల్లింపుల గడువును 2021 ఫిబ్రవరి 15 వరకు పెంచింది. ఈ మేరకు రహదారి రవాణా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జనవరి 1, 2021 నుంచి ఫాస్టాగ్‌ ద్వారానే పూర్తిస్థాయి టోల్‌ చెల్లింపులు చేయాలని ప్రకటించింది. ప్రస్తుతం టోల్‌ చెల్లింపుల్లో‌  ఫాస్టాగ్ లావాదేవీల వాటా 75-80 శాతం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఫిబ్రవరి 15 నుంచి 100 శాతం నగదురహిత టోల్‌ఫీజు చెల్లింపులు చేసుకొనే వసతులు ఎన్‌హెచ్‌ఐ చేపట్టగలదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం టోల్‌గేట్లలోని ఒక లైన్‌ను మాత్రం నగదు చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి చెప్పే ప్రక్రియలో భాగంగా  సాధారణ ఫీజుకు రెట్టింపును వసూలు చేయనున్నారు. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను తగ్గించేందుకు, వాహనాల వరుస లేకుండా సులువుగా వెళ్లి ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఈ ప్రక్రియ ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. టోల్‌ ఫీజుల డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబరు 1, 2017 తర్వాత తయారైన అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌లు తప్పనిసరి చేశారు. అంతకు ముందు తయారైన, అమ్మిన వాహనాలకు ఫాస్టాగ్‌ జోడించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీ చదవండి..

కరోనా మరణాలు: వణికి పోతున్న అగ్రదేశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని