Telangana News: బంజారాహిల్స్‌ ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి.. నివేదిక ఇవ్వాలని ఆదేశం

బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి, మనో వేదనకు గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. దారుణానికి పాల్పడిన వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Updated : 22 Nov 2022 15:37 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి, మనో వేదనకు గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. దారుణానికి పాల్పడిన నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం నుంచి సవివర నివేదిక కోరారు. మరో వైపు లైంగిక దాడి ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సఫిల్‌గూడలో ఉన్న ఆ పాఠశాల ప్రధానశాఖ వద్ద ఆందోళనకు దిగారు. సఫిల్‌గూడ బ్రాంచి ప్రిన్సిపల్‌ను కూడా తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రిన్సిపల్‌ను ఇప్పటికే తొలగించామని పాఠశాల మేనేజర్‌ తెలిపారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి(4)పై అదే పాఠశాల ప్రిన్సిపల్‌ వాహన డ్రైవర్‌ రజనీ కుమార్‌(34) లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అతడ్ని మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ప్రిన్సిపల్‌ గది సమీపంలో ఉండే డిజిటల్‌ గదిలోనే ఈ తతంగం జరిగినా ప్రిన్సిపల్‌ ఎస్‌.మాధవి(56) నిరోధించకపోడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఘటన జరగడానికి కారణమవ్వడమనే కారణాలతో ఆమెపై సెక్షన్‌ 21 పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి బుధవారం అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఇద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు పాఠశాలలో సీసీ ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని