Telangana News: ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా

బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Published : 27 Jan 2023 01:25 IST

హైదరాబాద్‌: బదిలీల విషయంలో  ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 317 జీవో ప్రకారం కొత్త జిల్లాలకు అనుగుణంగా టీచర్లను కేటాయించారు. ఆ సందర్భంలో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. తమను ఒకే చోటుకు బదిలీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2వేల మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు.  

హైదరాబద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర 13 జిల్లాల్లోనే దంపతులు ఎక్కువగా పనిచేసేందుకు మొగ్గు చూపారు. స్పౌజ్‌ కేటగిరీలో ఖాళీలను భర్తీ చేస్తే.. కొత్త నియామకాలకు ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో ఆ 13 జిల్లాలను ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ దంపతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. వీరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఖాళీలు, 317 జీవోకు అనుగుణంగా ఉన్న 615 మంది ఉపాధ్యాయ దంపతులను బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ప్రస్తుతం సూర్యాపేట మినహా 12 జిల్లాల్లోని 427 మందిని బదిలీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాబితా సిద్ధం చేసి డీఈవోలకు పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని