AP News: అరుదైన జీవులను కాపాడుకుందాం..

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే అరుదైన జీవులు సముద్ర తాబేళ్లు. మానవాళికి మేలుచేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కృష్ణా నది బంగాళాఖాతంలో....

Published : 12 Jun 2021 14:48 IST

అంతరించిపోయే ప్రమాదంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు

అవనిగడ్డ: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే అరుదైన జీవులు సముద్ర తాబేళ్లు. మానవాళికి మేలుచేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే సాగర సంగమం వద్ద వేలాదిగా ఇవి జీవిస్తున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న ఈ తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 

భూమి మీద ఉన్న అతి ప్రాచీనమైన సరీసృపాలు సముద్ర తాబేళ్లు. వీటి జీవితకాలం 100 నుంచి 150 ఏళ్లు. ఇవి సముద్ర సంచార జీవులు. ఆహారం, గుడ్లు పెట్టడం కోసం సుమారు 20 వేల కిలోమీటర్ల వరకు వలస వెళుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్ల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు భారతదేశంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు. ఈ సముద్ర తాబేలు ఒకేసారి 90 నుంచి 165 గుడ్లు పెడుతుంది. కాగా పదేళ్లకోసారి ఇక్కడకు వచ్చి గుడ్లు పెట్టి తమ సంతతిని పెంపొందించుకోవడం వీటి ప్రత్యేకత.

అటవీశాఖ అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల కృషితో ప్రభుత్వం సాగర సంగమం ప్రదేశంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ చేపడుతోంది. 2020 జనవరిలో నాగాయలంక లైట్‌హౌజ్‌, సంగమేశ్వరం, సూర్లగొంది, ఈలచెట్లదిబ్బలో గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేశారు.  సముద్ర తాబేళ్ల గుడ్ల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూ. లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నాయి. 2021లో కృష్ణ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉన్న సంరక్షణ కేంద్రాల్లో 65 వేల తాబేళ్ల పిల్లలను సముద్రంలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

అవగాహన లోపం వల్ల తాబేళ్ల జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. తాబేళ్లు ఒడ్డుకువచ్చే సమయంలో మత్స్యకారుల బోటు ఫ్యాన్లు తగిలి వేలాది తాబేళ్లు మృత్యువాతపడుతున్నాయి. బోటు ఫ్యాను రెక్కలు తగలకుండా మెష్‌ ఏర్పాటు, వలలో చిక్కుకుపోకుండా మత్స్యకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గుడ్ల సేకరణలో కూడా నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో గుడ్లు అడవి నక్కల పాలవుతున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న అరుదైన తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని