పోస్టు పెడతారు.. మొక్కలు నాటిస్తారు!

మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. వీలైతే మనం కూడా ఆచరించాలి. ఈ మాటల స్ఫూర్తితో ఓ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది యువ బృందం.

Published : 28 Nov 2020 00:24 IST

గ్రామాల్లోనూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు కృషి 


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. వీలైతే మనం కూడా ఆచరించాలి. ఈ మాటల స్ఫూర్తితో మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోందో యువ బృందం. చదువుతో పాటు సేవా కార్యక్రమాలు జీవితంలో భాగమని చెబుతోంది. పబ్జీ, టిక్‌టాక్‌లే కాదు.. సామాజిక మాధ్యమాల ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చని నిరూపిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను గ్రామాలకు సైతం పరిచయం చేస్తోంది ‘వీ ఆర్‌ ఫర్‌ యూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’. 

సినీ తారలు, ప్రముఖులు ఏం చేసినా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే ఎటువంటి కార్యక్రమాలనైనా వారితో ప్రారంభించేందుకే ఆసక్తి చూపిస్తారు జనం. అందుకు తాజా ఉదాహరణ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. పచ్చదనాన్ని పెంచడమే ధ్యేయంగా మొదలైన ఈ కార్యక్రమం ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చేరువైంది. ఆ స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అందరికీ చేరువ చేస్తున్నారు విజయనగరానికి చెందిన వీ ఆర్‌ఫర్‌ యూ వెల్ఫేర్‌ అసోసియేషన్ సభ్యులు‌. 

సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడింది విజయనగరానికి చెందిన ‘వీ ఆర్‌ ఫర్‌ యూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’. ఈ సంస్థను నడుపుతోంది ఉద్యోగాలు చేస్తున్న యువత.. డబ్బులు ఉన్న సంపన్నులు కాదు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు. తల్లిదండ్రులు ఖర్చులకు ఇచ్చే మొత్తంలో కొంత సమాజానికి కేటాయిస్తూ రెండేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించారు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరో అనాథ పిల్లలకు, రోడ్డుపై కాలం వెల్లదీసే వృద్ధులకు ఆహారం, దుస్తులు అందిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. కరోనా కాలంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వలస కూలీలకు ఆహారం, ఆర్థిక చేయూత అందించారు. వినూత్నంగా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్న సమయంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కళ్ల ముందు మెదిలింది. కొందరు ప్రముఖులు ఛాలెంజ్‌ను విసరటం, వాటిని మరికొందరు స్వీకరించడం ఈ యువబృందాన్ని ఆకర్షించింది. నగరాలు, పట్టణాల్లో ఆదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమాన్ని  గ్రామీణ వాసులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇన్‌స్టాగ్రాం సామాజిక మాధ్యమాన్ని వేదికగా తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా జిల్లావాసులకే కాకుండా రాష్ట్రంలోని మిత్రులకు ఈ ఛాలెంజ్‌ పరిచయం చేశారు. వీఆర్‌ ఫర్‌ యూ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు ఒక మొక్కను నాటాలి. ఆ ఫొటోనే ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేస్తూ మరో ముగ్గురు స్నేహితులకు సవాల్‌ విసరాలి. ఇలా ఇప్పటివరకు ఈ ఛాలెంజ్‌ను వందలాది మంది స్వీకరించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ చేపట్టిన వారికి బహుమతులు అందిస్తోంది ఈ సంస్థ. ముగ్గురితో ప్రారంభమైన వీఆర్‌ ఫర్‌ యూ సంస్థ సభ్యులు ఇప్పడు 30కి చేరుకున్నారు. వందకు పైగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని