Marriage: తప్పతాగి మండపానికి ఆలస్యంగా వరుడు.. పెళ్లికి నో చెప్పిన వధువు.. వేరే వ్యక్తితో..

తప్పతాగి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ వరుడికి వధువు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పేసింది.......

Published : 18 May 2022 01:48 IST

జైపుర్‌: తప్పతాగి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ వరుడికి వధువు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పేసింది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలనా గ్రామంలో ఈనెల 15వ తేదీన చోటుచేసుకుందీ ఘటన. వివాహ ముహూర్తం అర్ధరాత్రి 1.15 గంటలకు కాగా.. అంతకుముందు రోజు రాత్రే వరుడు.. వధువు గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం రాత్రి 9గంటలకు మొదలైన పెళ్లి బరాత్‌ (ఊరేగింపు) గంటల కొద్దీ కొనసాగింది. మిత్రులతో కలిసి తప్పతాగి చిందులేసిన వరుడు ముహూర్త సమయం దాటిపోయిన చాలా సేపటికి మండపానికి చేరుకున్నాడు.

అప్పటికే మండపం వద్ద చాలాసేపటి నుంచి ఎదురుచూస్తూఉన్న వధువుతోటు ఆమె బంధువులు వరుడి వాలకం, నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోనని మండపంలోనే వధువు తెగేసి చెప్పింది. దీంతో ఆమెకు బంధువుల తరఫు అబ్బాయికి ఇచ్చి చేయాలని వధువు కుటుంబసభ్యులు నిశ్చయించారు.

దీంతో వధువు కుటుంబంపై వరుడి కుటుంబసభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పెళ్లి కుమార్తె తరఫు వారు మాట్లాడుతూ.. వరుడితోపాటు ఆయన ఫ్యామిలీ ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, భవిష్యత్తులోనూ వారు అలాగే ఉంటారేమోననే భయంతో ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఇరు కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.

మహారాష్ట్రలోనూ గత నెల ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 22న మల్కాపుర్‌ పంగ్రా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. వధువు, ఆమె కుటుంబ సభ్యులంతా వివాహ వేదిక వద్దకు చేరుకొని వరుడి రాక కోసం ఎదురుచూశారు. ముహూర్తం సమయం సాయంత్రం 4 గంటలైతే వరుడు రాత్రి 8 గంటలకు రావడంతో అతడి తీరు పట్ల వధువు తండ్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయడంతో పెళ్లికి వచ్చిన తన బంధువుల అబ్బాయిని సంప్రదించి కుమార్తెతో వివాహం జరిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని