Published : 16 Aug 2020 00:37 IST

తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు

కాళేశ్వరం ప్రాజెక్టుతో వృద్ధి చెందినట్లు అంచనా


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో భూగర్భజలాల మట్టం పెరుగుతోంది. గతేడాది జులైతో పోలిస్తే ప్రస్తుత జులై వరకు దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని భూగర్భ జలవనరుల శాఖ ప్రకటించింది. నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, భువనగిరి జిల్లాల్లో నీటిమట్టం పెరుగుదల అధికంగా ఉందని నిర్ధారించింది.

రాష్ట్రంలో భూగర్భజల మట్టంలో మంచి పెరుగుదల నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జలాశయాలు, చెరువులు నింపుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరుగుతోంది. ఈ మేరకు భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలో పరిస్థితిని విశ్లేషించింది. ఈ ఏడాది జులైలో భూగర్భజలాల సగటు లోతు 9.26 మీటర్లు ఉంది. గతేడాది ఇదే నెలలో సగటు 14.12మీటర్లకు పడిపోయింది.  అంటే 4.86మీటర్ల మేర భూగర్భ జల మట్టంలో పెరుగుదల ఉందని తేలింది. గత దశాబ్ద కాలంగా చూసినా సగటున 2.4 మీటర్ల మేర భూగర్భజలాల్లో పెరుగుదల నమోదైంది.  జులైలో 158 టీఏంసీల మేర భూగర్భజలాలు పెరిగాయని, ఈ సీజన్‌లో పెరుగుదల 208 టీఎంసీల మేర ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.
10 శాతం జలాల వృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భూగర్భజలమట్టం పెరుగుదలలో కీలకంగా మారిందని అధికారులు తేల్చారు. 2019 జులైలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భూగర్భజలాలు 10మీటర్ల దిగువన 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. 2020 జులై నాటికి ఆ విస్తీర్ణం 2,419 చ.కి.మీలకు పెరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఇది 16శాతం. అంటే 1,817 కిలోమీటర్ల మేర పెరుగుదల ఉందని అధికారులు నిర్ధారించారు. 20 మీటర్ల దిగువన భూగర్భజలాలు ఉండే ప్రాంతాలు 39.6 శాతం తగ్గాయని లెక్క తేల్చారు. గతంతో పోల్చితే నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భూగర్భజలమట్టం గణనీయంగా పెరిగిందని భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది. గత దశాబ్దపు గణాంకాలు పరిశీలిస్తే పెరుగుదల గణనీయంగా ఉందని అధికారులు తెలిపారు. 2010-19 వరకు భూగర్భజలాలు 10 మీటర్ల దిగువన 981 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆ విస్తీర్ణం  2,419 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే 10శాతం విస్తీర్ణంలో జలాలు పెరిగాయని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని