ఏ నిర్ణయం తీసుకోకుండానే..

రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు

Updated : 13 Oct 2020 04:42 IST

దిల్లీ: రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ మండలి సమావేశం వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్టీ మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పరిహారం చెల్లింపు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయానికి 12 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రాలు లేవనెత్తిన మరికొన్ని డిమాండ్లు పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమయం కోరింది. వీటి వివరాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ‘‘మార్కెట్ల నుంచి రుణాలు తీసుకునేందుకు 12 రాష్ట్రాలు అంగీకారం తెలుపగా.. 9 రాష్ట్రాలు మాత్రం కేంద్రమే ఆ రుణాలు తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాలని పట్టుబట్టాయి. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే దేశం మొత్తంపై  ప్రభావం అంతగా ఉండదు.  అన్ని రాష్ట్రాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తోంది. అన్ని రాష్ట్రాల సందేహాలను పరిష్కరించాము. ఎక్కువ రుణం తీసుకుంటే వడ్డీ రేట్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ప్రైవేట్‌ రంగంపై ప్రభావం చూపుతుంది.  రాష్ట్రాల ఖర్చులు తీర్చగలిగేలా త్వరగా రుణాలు తీసుకోవాలనుకుంటున్నారు.  కొన్ని రాష్ట్రాలు ముందుగానే రుణాలు తీసుకోవాలని కోరుతున్నాయి. నేటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించడానికి కేంద్రం కట్టుబడి ఉంది. కౌన్సిల్‌లో సెస్‌ రికవరీ వ్యవధిని పెంచాలని నిర్ణయించారు. రుణాలు పొందే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరాం. రుణాలు తీసుకోవాలనుకునే రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ విషయంపై కూడా..  ఏకాభిప్రాయం రాలేదు.  జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం రుణం తీసుకోబోదు. రుణం తీసుకోవాలనుకునే రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు ఇస్తుంది. రుణాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించే రాష్ట్రాలు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దం లాంటిదేమీ లేదు’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని