
Ganesh Idol: బిస్కెట్ ప్యాకెట్లతో గణపతి విగ్రహం అలంకరణ.. ఎలా ఉందంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఏటా వినాయకచవితిని పురస్కరించుకుని విభిన్న రూపాల్లో గణేశ్ ప్రతిమలు కొలువుదీరడం మనం చూస్తూనే ఉంటాం. ఎవరికి వారు తాము ఏర్పాటు చేసిన విగ్రహం ప్రత్యేకంగా కనపడేలా తీర్చిదిద్దుతారు. లుథియానాకు చెందిన ఓ బేకరి వాళ్లు చాక్లెట్‌తో 200 కేజీల గణపతి విగ్రహాన్ని తయారు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. తాజాగా గుజరాత్‌లో ఓ మహిళ బిస్కెట్ ప్యాకెట్స్‌తో విగ్రహాన్ని అలంకరించి ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేశారు.
గుజరాత్‌కు చెందిన రాధిక సోనీ అనే మహిళ ఆహార వృథాను అరికట్టడానికి గతంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా బిస్కెట్ ప్యాకెట్లతో ఐదు అడుగుల శివలింగాన్ని తయారు చేసి మధ్యలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీని తయారీకి 1008 బిస్కెట్ ప్యాకెట్లతో పాటు 850 రుద్రాక్షలను వాడారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు పంచే రెండు సంస్థలకు చెందిన బ్యానర్లను కూడా ఉంచారు.
‘‘ఇలాంటి ప్రత్యేకమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన వ్యక్తిగత అనుభవం ద్వారానే వచ్చింది. మా ఇంట్లో నిర్వహించిన వేడుకల్లో చాలా ఆహారం వృథా అయ్యేది. ఆ తర్వాత అసలు ఆహారాన్ని వృథా చేయొద్దని నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా రోజూ మూడింట ఒక వంతు ఆహారం వృథా అవుతోంది. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం.. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 50కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారని నివేదిక చెబుతోంది. అందుకే దాన్ని అరికట్టడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విగ్రహ తయారీలో వాడిన బిస్కెట్ ప్యాకెట్లను నిమజ్జనం తర్వాత పేదలకు పంచిపెడతాం’’ అని రాధిక పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.