తిండిబోతు చక్రవర్తి: విషం కూడా భోజనంలో భాగమే!

రాజ్యాలను పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. వారిలో ఒక్కో రాజుది ఒక్కో జీవనశైలీ. వారి విలాసాలు.. అలవాట్లు.. జీవించిన విధానం భిన్నంగా ఉంటాయి. ఒకప్పటి గుజరాత్‌ చక్రవర్తి మహమూద్‌ బెగాడ ఆహార అలవాట్ల గురించి చెప్పుకుంటే ఆశ్చర్యమేయక మానదు. ఎందుకంటే

Updated : 30 May 2021 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్యాలను పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. వారిలో ఒక్కో రాజుది ఒక్కో జీవనశైలీ. వారి విలాసాలు.. అలవాట్లు.. జీవించిన విధానం భిన్నంగా ఉంటాయి. ఒకప్పటి గుజరాత్‌ చక్రవర్తి మహమూద్‌ బెగాడ ఆహార అలవాట్ల గురించి చెప్పుకుంటే ఆశ్చర్యమేయక మానదు. ఎందుకంటే ఆయన గొప్ప ఆహారప్రియుడు. ఎంతలా అంటే.. ఒక్కరోజులో 35 కిలోల అన్నాన్ని తినేసేవాడట.

మహారాజు మహమూద్‌ బెగాడ అసలు పేరు మహమూద్‌ షా I. 1458-1511 మధ్య గుజరాత్‌ను పరిపాలించారు. కేవలం 13ఏళ్ల వయసులో సింహాసనం పగ్గాలు అందుకున్న మహమూద్‌ బెగాడ ఎక్కువకాలం (53 సంవత్సరాలు) పాలించిన రాజుల్లో ఒకడిగా నిలిచాడు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే మహమూద్‌.. ఆహారాన్ని చూస్తే ఆగలేకపోయేవాడట. ప్రతి రోజు భోజనంతోపాటు ఏదో ఒకటి తింటూనే ఉండేవాడు. ఎంత తిన్నా ఆయనకు సులభంగా అరిగిపోవడం విశేషం. అందుకే ఉదయాన్నే అల్పహారంగా ఒక గిన్నె నిండా తేనె, మరో గిన్నె నిండా వెన్న కడుపులో పడేసి.. ఆ తర్వాత 100 నుంచి 150 వరకు అరటిపండ్లు తినేవాడట. మధ్యాహ్నం.. రాత్రి భోజనంలో కిలోల కొద్ది ఆహారం తినేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. అంత తిన్న తర్వాత కూడా ఆకలి వేసినట్టు అనిపిస్తే.. కనీసం 4.5కిలోల పరమాన్నం లేదా తీపి పదార్థాలను తినేవాడు. అయినా.. రాత్రుళ్లు ఆయనకు ఆకలేసేదట. అందుకే అంతఃపుర సిబ్బంది ఆయన పడుకునే మంచం ఇరువైపులా మాంసంతో చేసిన సమోసాలను పెట్టేవారట.

విషమూ గుటకాయస్వాహా:!

యూరోపియన్‌ చరిత్రకారులు చెప్పిన ప్రకారం.. ఒకసారి శత్రువులు మహమూద్‌పై విష ప్రయోగం చేసేందుకు ప్రయత్నించారట. దాని నుంచి తప్పించుకున్న ఆయన.. ఆ తర్వాత విషం తిన్న ఏమీ కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకునే క్రమంలో ప్రతి రోజు తక్కువ మొత్తంలో విషం తీసుకునేవాడట. అయితే, రోజు విషం తీసుకుంటుండటంతో ఆయన విప్పేసిన దుస్తుల్ని ఎవరూ ముట్టుకునేవాళ్లు కాదు. దుస్తులు కూడా విషపూరితమవుతాయని వాటిని కాల్చేసేవారు. అలా మహమూద్‌ బెగాడ ఆహారపు అలవాట్లు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు