‘హాలోవీన్’‌ ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఏటా జరిగే అనేక వేడుకల్లో హాలోవీన్‌ వేడుక ఎంతో విభిన్నం. సాధారణంగా అన్ని వేడుకలకు కొత్త దుస్తులు ధరించి దైవ ప్రార్థన చేస్తారు. కానీ, ఈ హాలోవీన్‌ వేడుకలకు చిన్నారులు, యువకులు దెయ్యాలు, రాక్షసులదుస్తులు ధరించి ఇతరులను భయపెట్టే ప్రయత్నం

Published : 31 Oct 2020 00:51 IST

ప్రపంచవ్యాప్తంగా ఏటా జరిగే అనేక వేడుకల్లో హాలోవీన్‌ వేడుక ఎంతో విభిన్నం. సాధారణంగా అన్ని వేడుకలకు కొత్త దుస్తులు ధరించి దైవ ప్రార్థన చేస్తారు. కానీ, ఈ హాలోవీన్‌ వేడుకలకు చిన్నారులు, యువకులు దెయ్యాలు, రాక్షసులదుస్తులు ధరించి ఇతరులను భయపెట్టే ప్రయత్నం చేస్తారు. గుమ్మడి కాయలను రకరకాల ఆకృతుల్లో అలంకరించి, ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రిపూట విందువినోదాలతో వేడుక జరుపుకొంటారు. ఏటా అక్టోబర్‌ 31న నిర్వహించే ఈ హాలోవీన్‌ వేడుకలు అసలు ఎలా మొదలయ్యాయి? ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్రేంటో చూద్దామా..

క్రీస్తుపూర్వమే ఐర్లాండ్‌, యూకే, ఉత్తర ఫ్రాన్స్‌లో ఉన్న సెల్ట్స్‌ తెగ ప్రజలు ఈ హాలోవీన్‌ వేడుకలకు జరుపుకొనేవారు. అప్పుడు ఈ వేడుకను సమ్‌హైయిన్‌ అని పిలిచేవారు. సెల్ట్స్‌ ప్రజలకు నవంబరు 1వ తేదీ నుంచి నూతన సంవత్సరం మొదలయ్యేది. నవంబర్‌లో చలి పెరగడంతోపాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశముంది. పంటలకు ఇబ్బంది కాలం. రాత్రి సమయం ఎక్కువ. దీంతో ఈ నవంబరు కాలాన్ని ప్రజలు మృత్యువుతో పోల్చేవారు. ఈ నెల వచ్చిందంటే ఆత్మలు భూమిపైకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతాయని, పంటలు నాశనం చేస్తాయని నమ్మేవారు. దీంతో నవంబరు 1వ తేదీ ముందు రోజు రాత్రి అంటే అక్టోబర్‌ 31న మత గురువుల సూచనల మేరకు వీధుల్లో మంటలు పెట్టి.. దాని చుట్టూ చేరి కులదైవాన్ని ప్రార్థిస్తూ.. జంతువుల్ని మంటల్లో వేసి బలిచ్చేవారు. జంతువుల తలల్ని తీసి వారి నెత్తిన పెట్టుకొని, వాటి చర్మాల్ని ధరించేవారు. అలా చేస్తే ఈ చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు రావని వారి నమ్మకం. ప్రకృతిని నమ్ముకునే రైతులకు ఇలాంటి సంప్రదాయం భవిష్యతుపై నమ్మకాన్ని ఇచ్చేది. అలా అప్పటి సెల్ట్స్‌ ప్రజలు జరుపుకొనే ‘సమ్‌హైయిన్‌’ వేడుకల్నే ఇప్పుడు హాలోవీన్‌గా చేసుకుంటున్నారని చరిత్ర కారులు చెబుతున్నారు.

క్రైస్తవుల సంప్రదాయం..

హాలోవీన్‌ వేడుక జరపడానికి మరో కారణముంది. 7-8శతాబ్ద కాలంలో యూరప్‌లోని రోమ్‌లో క్రైస్తవ మత గురువు పోప్‌ నవంబర్‌ 1వ తేదీన సెయింట్స్‌ గౌరవార్థం ‘ఆల్‌ సెయింట్స్‌ డే’ పేరుతో వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దానికి ముందు రోజు(అక్టోబర్‌ 31) రాత్రి ఆత్మలను తరిమేయడం కోసం ‘ఆల్‌ హాలోస్‌ ఈవ్‌’ పేరుతో వేడుక నిర్వహించాలన్నారు. ఈ వేడుకలను ‘సమ్‌హైయిన్‌’ మాదిరిగానే జరపడం మొదలుపెట్టారు. ఇదే క్రమంగా ‘హాలోవీన్‌’గా మారింది. 

అమెరికాకు.. ఆపై ప్రపంచానికి

యూరప్‌ వ్యాప్తంగా విస్తరించిన ఈ ‘హాలోవీన్‌’ సంప్రదాయం ఇక్కడి ప్రజల ద్వారా 19వ శతాబ్దంలో అమెరికాకూ వ్యాపించింది. క్రైస్తవులకు సంబంధించిన వేడుకే కనుక అమెరికా ప్రజలు దీనిని జరుపుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే, వేడుకలు నిర్వహించడంలో కొత్త పద్ధతులు వచ్చి చేరాయి. చిన్నారులు దెయ్యాలు, ఎముకల గూడు సహా చిత్రవిచిత్ర వేషాధారణలతో ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి ట్రీట్‌ అడుగుతారు. ఆ ఇంట్లో వాళ్లు పిల్లలకు ఏవైనా తినుబండరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే ‘ట్రిక్‌ ఆర్‌ ట్రీటింగ్‌’ అంటారు. అలాగే గుమ్మడి కాయల్ని వివిధ రాక్షస రూపాల్లో కట్‌ చేసి దీపాలు పెట్టి ఇంటి పరిసరాల్లో అలంకరిస్తారు. ఆ తర్వాత విందు వినోదాలతో సంబరాలు చేసుకుంటారు.

ఆ వేషాలు.. గుమ్మడికాయలెందుకు?

భయంగొల్పే దుస్తులు వేసుకోవడం వెనుక ఆసక్తికర విషయం ఉంది. హాలోవీన్‌ రోజున ఆత్మలు భూమిపైకి వస్తాయని చెబుతారు. అయితే, ఆ ఆత్మలు ఇలాంటి భయానక దుస్తులు ధరించిన వారిని చూసి వాళ్లూ కూడా ఆత్మలే అనుకొని ఏమనకుండా వెళ్లిపోతాయట. ఇక గుమ్మడి కాయల్లో దీపాలు పెట్టి ఇంటి పరిసరాల్లో పెడితే ఆత్మలు ఇంట్లోకి రావని నమ్ముతారు. అందుకే హాలోవీన్‌ రోజున ఈ రెండింటిని తప్పకుండా పాటిస్తారు. ఒకప్పుడు క్రైస్తవులు, కొన్ని దేశాలకే పరిమితమైన ఈ వేడుకలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాంత, మత భేదాలు లేకుండా అందరూ జరుపుకోవడం విశేషం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు