ఆ బాలుడి ఆత్మవిశ్వాసానికి సలాం..

రెండు చేతులు, రెండు కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోని ఆ బాలుడు నోటితో కుంచె పట్టి బొమ్మలు గీస్తూ మెప్పిస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని చిత్రకారుడిగా ఎదుగుతున్నాడు....

Published : 30 Dec 2020 01:49 IST

నోటితో చిత్రాలు గీస్తూ మెప్పిస్తున్న బాలుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిత్రులతో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన బాలుడు చావు అంచుల వరకు వెళ్లాడు. చివరకు ప్రాణాలు మిగిలినా.. రెండు చేతులు, రెండు కాళ్లు లేకుండా జీవించాల్సి వచ్చింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని ఆ బాలుడు నోటితో కుంచె పట్టి బొమ్మలు గీస్తూ మెప్పిస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని చిత్రకారుడిగా ఎదుగుతున్నాడు. నటి సమంత నిర్వహిస్తున్న ఓ టీవీ కార్యక్రమానికి ఇటీవల వెళ్లి మెగాస్టార్‌ చిరంజీవిని మెప్పించాడు. ఆయన చిత్రాన్ని వేదికపైనే నోటితో గీసి ప్రశంసలందుకున్నాడు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన తుల్జారాం-ప్రమీల దంపతులకు మధుకుమార్‌ నాలుగో సంతానం. గతేడాది సెప్టెంబర్‌లో విద్యుదాఘాతానికి గురయ్యాడు. మిత్రులతో కలిసి ఓ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదం సంభవించింది. ప్రాణాలు దక్కవని వైద్యులు తేల్చిచెప్పారు. కుమారుడి కోసం తల్లడిల్లినా.. నిస్సహాయస్థితిలో తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బాలుడిని తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్పించేలా చొరవ తీసుకున్నారు. 

బాలుడి దయనీయ స్థితిని ఈనాడు-ఈటీవీ వెలుగులోకి తెచ్చింది. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు స్పందించి తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. విషయం తెలుసుకున్న విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రఘు అరికెపూడి బాలుడి లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నోటితో చిత్రాలు గీసేందుకు చిత్రకారుడు సముద్రాల.. మధుకుమార్‌కు శిక్షణ ఇచ్చారు. ఇందుకు హర్ష సాయం తీసుకున్నారు. రెక్కలు తెగిన పక్షిలా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన మధుకుమార్‌ ఏడాది కాలంలోనే ఇతరుల్లో స్ఫూర్తిని నింపే స్థాయికి చేరుకున్నాడు. కాళ్లూ, చేతులు లేవనే బెంగ లేకుండా పాటలకు హుషారుగా స్టెప్పులేస్తున్నాడు. నాలుకతో సెల్‌ఫోన్ వాడటం నేర్చుకున్నాడు. తమ కుమారుడి ధైర్యమే మమ్మల్ని ముందుకు సాగేలా చేస్తోందని బాలుడి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి...

స్నేహితుడితో పాట పాడుతుంటే.. జుట్టుకు నిప్పు

రెండువేల ఏళ్లనాటి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని