Harish Rao: కంటి వెలుగు.. ఈసారి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అద్దాల పంపిణీ: హరీశ్‌రావు

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నేటి నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలు సేవలు అందింస్తున్నాయి.

Updated : 19 Jan 2023 12:13 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సహా దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట వివేకానంద కమ్యూనిటీ హాల్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. శని, ఆదివారాలు, సెలవుదినాలు మినహా మిగతా రోజుల్లో నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు.

‘‘ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలు సేవలు అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేసి దృష్టిలోపాలను గుర్తించటంతోపాటు మందులు, కళ్లద్దాలు అందిస్తాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు సైతం సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఒక్కో శిబిరంలో  8 మంది సిబ్బంది అందుబాటులో ఉండి పరీక్షలు చేస్తారు. నిత్యం సుమారు 120 మందికి ఒక్కో కేంద్రంలో టెస్టులు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం.

‘‘గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న వారు కావాలంటే జీహెచ్‌ఎంసీకి ట్విటర్, వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదిస్తే మీ దగ్గరికే పరీక్ష బృందాలు వస్తాయి. జీహెచ్‌ఎంసీలో గతంలో ఉన్న 195 బృందాలకు అదనంగా మరో 5శాతం బృందాలను పెంచాం.  ప్రెస్‌క్లబ్‌లలో కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేస్తాం. దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కంటి వెలుగును అభినందించారు. ఈ కార్యక్రమాన్ని వారి రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామన్నారు. ఈసారి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి.. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అని హరీశ్‌రావు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని