Hyderabad: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు: హరీశ్‌రావు

కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు జరిగిన మహిళల పరిస్థితిని రెండు రోజులుగా సమీక్షిస్తున్నామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

Published : 01 Sep 2022 02:32 IST

హైదరాబాద్‌: కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు జరిగిన మహిళల పరిస్థితిని రెండు రోజులుగా సమీక్షిస్తున్నామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతిచెందిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. వారి పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించి చదివించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన మిగతా మహిళలు సురక్షితంగా ఉన్నారని.. వారికి మరోసారి పరీక్షలు జరిపి కోలుకున్నాక దశల వారీగా ఇంటికి పంపిస్తామన్నారు. నగరంలోని నిమ్స్‌, అపోలో ఆస్పత్రుల్లో మహిళలకు చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఏడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని.. గతంలో ఎప్పుడూ జరగని సంఘటన ఇప్పుడు జరిగిందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై డీహెచ్‌ నివేదిక వచ్చాక నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌ వల్లే మహిళలు మృతిచెందినట్లు తెలిసిందని.. పోస్టుమార్టం రిపోర్టు, డీహెచ్‌ నివేదిక ఆధారంగా అసలు కారణాలు తెలుస్తాయని హరీశ్ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని