Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నివేదికను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Published : 29 Jan 2023 17:20 IST

హైదరాబాద్‌: ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రగతి నివేదికలు గతేడాది కంటే మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి పని చేయడం వల్లే  ఇంతటి వృద్ధి సాధించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నివేదికను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్ఘటనలు ఎదురైనప్పుడు సమీక్షలు చేసి వాటిని సరిదిద్దుతున్నామన్నారు. కొన్ని రంగాల్లో తెలంగాణ కంటే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాలు ముందున్నాయన్న హరీశ్‌రావు.. 2022 వైద్యరంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. వైద్యరంగంలో మెరుగైన పనితీరు కలిగిన మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్‌ గుర్తించిదని అన్నారు. గతేడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. మరో 9 వైద్య కళాశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నలుమూలలా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని  తెలిపారు.

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు చివరి స్థానం

‘‘ వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. 8 వేల పడకలతో హైదరాబాద్‌ చుట్టూ నాలుగు సూపర్‌స్పెషాలటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా 515 డయాలసిస్‌ యంత్రాలతో 61 డయాలసిస్‌ కేంద్రాలను మంజూరు చేశాం. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నొస్టిక్స్ హబ్స్‌ నడుపుతున్నాం.. త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. సుమారు 62శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. గతేడాది 98 బస్తీ దావాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. డబుల్‌ ఇంజిన్‌  సర్కారు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ వైద్య సేవల్లో చివరిస్థానంలో నిలిచింది. మిడ్‌ వైఫరీ సేవల్లోనూ తెలంగాణను కేంద్రం, యునిసెఫ్‌ ప్రశంసించాయి. టీ డయాగ్నస్టిక్స్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ చెప్పింది.’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.

మనం దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలీ కన్సల్టెన్సీ సేవలు అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు అన్నారు. ఎంబీబీఎస్‌ సీట్లలో దేశంలో తొలిస్థానం, పీజీ మెడికల్‌ సీట్లలో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ‘‘ టీబీ నివారణలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది. గత ఏడాది 716 ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్‌లు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో  27,500 పడకలు ఉంటే వాటన్నిటికీ ఆక్సిజన్‌ సరఫరా చేశాం. రోగికి అందించే భోజనం ఖర్చును రూ.40 నుంచి రూ.80కి పెంచాం. 18 ప్రధాన ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు సైతం భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఐఎంహెచ్‌ఎంఎఫ్ కింద నిధులు విడుదల చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పథకం కింద 2.59 లక్షల మందికి సేవలు అందించాం. ఆరోగ్య శ్రీ కింద రూ. 5 లక్షల వరకు, తీవ్ర వ్యాధులకు రూ.10 లక్షల వరకు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో 887 పీహెచ్‌సీ కేంద్రాలుండగా.. అన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.

నార్మల్‌ డెలివరీకి రూ.3000 ఇన్సెంటివ్‌

2021లో4.21 కోట్ల మంది ఓపీ ద్వారా చికిత్స చేయించుకుంటే.. 2022లో అది 4.80 కోట్లకు పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. 2021 ఇన్‌పేషెంట్‌ బాధితులు 14.16 లక్షలకు కాగా.. 2022లో 16.90 లక్షలకు చేరినట్లు చెప్పారు. 2021లో 2.57 లక్షల శస్త్ర చికిత్సలు చేస్తే.. 2022లో అది 3.04 లక్షలకు పెరిగినట్లు చెప్పారు. ఏడాది కాలంలో 986 మంది వైద్యులను నియమించినట్లు హరీశ్‌రావు తెలిపారు. మాతాశిశు సంక్షేమానికి రూ.403 కోట్లు కేటాయించామన్నారు. ‘‘ ప్రసవ సమయంలో మహిళలు చనిపోతే ప్రతి మరణాన్నీ నమోదు చేస్తున్నాం. సిజేరియన్‌ రేట్‌ తగ్గించేందుకు నార్మల్‌ డెలివరీ చేసిన వారికి రూ.3000 ఇన్సెంటివ్‌ ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ల ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కోసం 56 ఆసుపత్రుల్లో టిఫా స్కాన్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 

ఐదు అంచెల్లో వైద్య సేవలు

రాష్ట్రంలో ఐదు అంచెల విధానంలో వైద్య సేవలు అందిస్తున్నామన్న హరీశ్‌రావు..2500 పల్లె దవాఖానాలు ప్రారంభించే ప్రక్రియకు 2022లోనే శ్రీకారం చుట్టామన్నారు.హైదరాబాద్‌ కాకుండా ఇతర నగరాల్లో 100 బస్తీ ఆసుపత్రుల ఏర్పాటు పనులు ముమ్మరం చేశామన్నారు. ‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలోనూ తెలంగాణకు పలు అవార్డులు వచ్చాయి. ఈ ఏడాదిలో ప్రతి జిల్లాకు మెడికల్‌ కళాశాల తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది పూర్తయ్యేసరికి 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆహార కల్తీని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు