Viral video: నాయకత్వం అంటే అధికారం కాదు.. బాధ్యత: హర్ష గోయెంకా

నాయకత్వం అంటే అధికారం అని చాలా మంది భావిస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే దాన్నో బాధ్యతగా స్వీకరిస్తారు. తన బృందానికి పని కేటాయించడంతోపాటు.. ఆ పనిని సమయానికి పూర్తి చేసేలా ప్రోత్సహించడం కూడా ముఖ్యమే. 

Published : 08 Nov 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లీడర్‌షిప్‌ని చాలా మంది అధికారంగా భావిస్తే, అతికొద్దిమంది మాత్రమే దాన్నో బాధ్యతగా స్వీకరిస్తారు. అలాంటి నాయకత్వం కలిగిన వ్యక్తులు ఎలాంటి మాట చెప్పినా శ్రద్ధతో వింటాం.. ఆచరించేందుకు ప్రయత్నిస్తాం. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కూడా ఇదే కోవలోకి వస్తారు. తరచుగా సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్‌ చేసే పోస్టులు, వీడియోలు స్పూర్తిని రగిలించడమే కాకుండా, ఆలోచింపజేస్తాయి. తాజాగా ఆయన ట్వీట్ చేసిన వీడియో నిజమైన నాయకత్వ లక్షణాన్ని గుర్తుచేస్తోంది. నేర్చుకోవాలేగానీ.. ప్రకృతి మనకు ఎంతో నేర్పిస్తుందనేందుకు ఈ వీడియో ఓ  చక్కని ఉదాహరణ. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?

అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో కొన్ని టర్కీ కోళ్లు రోడ్డు దాటుతుంటాయి. గుంపులోని కోళ్లన్నీ రోడ్డు దాటేవరకు వాటిలో ఒక కోడి రోడ్డు మధ్యలో అడ్డంగా ఉంటుంది. చివరి కోడి రోడ్డు దాటాక దాంతో పాటు అవతలికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో కోడి రోడ్డు మధ్యలో ఉండటంతో ఇరువైపులా వాహనాలు కూడా నిలిచిపోతాయి. ఈ వీడియోను హర్ష గోయెంకా షేర్‌ చేస్తూ ‘లీడర్‌షిప్‌లో ఇదో పాఠం’ అని ట్వీట్ చేశారు. గోయెంకా షేర్‌ చేసిన వీడియోపై నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ‘నిజం చెప్పారు. నాయకత్వమంటే అధికారం కాదు, అదో బాధ్యత’ అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేయగా, వీటి నుంచి టీమ్‌ లీడర్స్‌ ఎంతో నేర్చుకోవాలని మరో నెటిజన్‌ కామెంట్ చేశారు. ప్రకృతే మనకు గొప్ప గురువు అంటూ నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం టర్కీ కోళ్లు రోడ్డు దాటిన  వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని