Headaches: పిల్లలకు తలనొప్పా..? ఎందుకొస్తుందో తెలుసా..?

పిల్లల్లోనూ మైగ్రేయిన్‌, మానసిక ఒత్తిడితో తలనొప్పి వస్తుందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated : 30 Oct 2022 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారులను పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పినపుడు చెప్పే సాకులేంటో తెలుసా...? తలనొప్పి, కడుపునొప్పి అది ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆ కారణాలు చెప్పి మెలికలు తిరిగిపోతారు. తలపట్టుకొని కూర్చుంటారు. నిజానికి పిల్లలు కొన్నిసార్లు అబద్దాలు చెప్పినా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాన్నా.. పులి కథలా కాకుండా పిల్లలు చెప్పే కారణాలను పరిశీలించి అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పిల్లల్లోనూ మైగ్రేయిన్‌, మానసిక ఒత్తిడితో తలనొప్పి వస్తుందని ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ సయ్యద్‌ ముదస్సర్‌ పేర్కొన్నారు.

ఎప్పుడు అవసరమంటే...!

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తలనొప్పి, కడుపునొప్పి కారణాలు చెబుతున్నారని భావిస్తారు.. కానీ వాటిని పట్టించుకోవాలి. నిజంగా చెప్పినపుడు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. 3-10 ఏళ్ల పిల్లల్లో  మైగ్రేయిన్‌ వారసత్వంగా రావొచ్చు. సైనస్‌, ఇన్‌ఫెక్షన్‌, జ్వరం, మెదడువాపుతోనూ తలనొప్పి వస్తుంది.  కొంతమంది పిల్లలకు తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతాయి. జ్వరం, వాంతులతో తలనొప్పి వస్తే చాలా జాగ్రత్త పడాలి.

ఏం చేయాలంటే...

నిద్రలేమి, మైగ్రేయిన్‌, ఒత్తిడితో తలనొప్పి వస్తుంది. కొంతమందికి కంటి చూపు సరిగా లేకపోయినా తలనొప్పిగా ఉంటుంది. సొంతంగా వైద్యం చేయొద్దు. ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి. ఎక్కువ మంది పిల్లలకు డీ హైడ్రేషన్‌, ఆహారం తక్కువగా తినడంతో ఇబ్బందులు వస్తాయి. సాధారణ తలనొప్పికి పారాసిటమాల్‌ సరిపోతుంది. తరచుగా తలనొప్పి ఉందంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని