కొవిడ్‌ ఎఫెక్ట్‌: పిల్లల పెరుగుదలపై ప్రభావం?

ఏడాది కాలంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. ఇది వారిని స్థూలకాయులుగా మార్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated : 22 Mar 2021 05:06 IST

హెచ్చరిస్తున్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాది కాలంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. ఇది వారిని స్థూలకాయులుగా మార్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం, బయటివారితో తక్కువగా కలవడం, శారీరక శ్రమకు దూరం కావడం వంటి అంశాలు వారి శరీర బరువు పెరగడానికి కారణమవుతాయని చెబుతున్నారు. మధ్య, ఉన్నత వర్గాల పిల్లల్లో స్థూలకాయం సమస్య పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

కరోనా విజృంభణ నాటి నుంచి మధ్య, ఉన్నత వర్గాల పిల్లల్లో అధికబరువు సమస్య మరింత ఎక్కువగా మారే ప్రమాదం ఉంది. ఇళ్లకే పరిమితమైన యువకులు, పాఠశాల వయసు పిల్లల్లో పోషక విలువలు తక్కువగా ఉండి, అధిక కెలొరీల చిరుతిళ్లను తినే ధోరణి పెరిగింది. ముఖ్యంగా మిక్చర్‌, బిస్కట్లు, బ్రెడ్‌, నూడుల్స్‌, ఐస్‌క్రీం, ఫ్రైడ్‌ స్నాక్స్‌, కేక్‌, తియ్యటి శీతల పానియాల వినియోగం ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఏర్పడ్డ పరిస్థితులతో ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడేందుకు కార్బొహైడ్రేట్‌, షుగర్‌, కొవ్వు ఎక్కువగా ఉండే ఇటువంటి తిను పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారని పోషకాహార నిపుణులు డాక్టర్‌ శీలా వీర్‌ పేర్కొన్నారు. దీంతో వారు ఆటలు ఆడకుండా గంటల తరబడి కంప్యూటర్‌, టీవీ ముందే కూర్చోవడం కూడా అధిక బరువుకు కారణమవుతుందని చెబుతున్నారు.

గతేడాది నుంచి పాఠశాలలు మూతపడడంతో తోటి విద్యార్థులను కలుసుకోలేకపోవడం, సామాజిక మాధ్యమాలకే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కొందరు పిల్లల్లో ఆందోళన పెరుగుతున్నట్లు గుర్తించామని దిల్లీకి చెందిన పోషకాహార నిపుణులు డాక్టర్‌ సుజీత్‌ రంజన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ పరిస్థితులు కేవలం చిన్నారులకే కాకుండా పెద్దవారిలోనూ స్థూలకాయం పెరగడానికి కారణమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేత శారీరక, మానసిక ధృఢత్వం కోసం ఆటలు, మిత ఆహారం, టీవీ తగ్గించడం వంటి చర్యల వల్ల స్థూలకాయం బారినపడకుండా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మహమ్మారి విజృంభణకు ముందు జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో దేశంలో 22 రాష్ట్రాల్లో పోషకాహార లోపంతో ఎంతోమంది చిన్నారులు బాధపడుతున్నట్లు వెల్లడైంది. అదేసమయంలో దాదాపు 20 రాష్ట్రాల్లో చిన్నారుల్లో స్థూలకాయం పెరుగుతున్నట్లు నివేదించింది. ఈ సందర్భంగా చిన్నారుల బరువు పెరగడం, స్థూలకాయులుగా మారే అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని