Supreme court: కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో విచారణ

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Published : 09 Jul 2024 12:02 IST

దిల్లీ: కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంపై ఆంధ్రప్రదేశ్‌ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై కేంద్రం నుంచి తగిన ఆదేశాలు తీసుకుని తాజాగా అఫిడవిట్ దాఖలు చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా కోర్టుకు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇవ్వడం తమకు సమ్మతమేనని ఆంధ్రప్రదేశ్ గతంలోనే చెప్పింది. ఇదే అంశంపై విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు అన్నారు. అయితే నోటిఫికేషన్ జారీ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని కేంద్రం (కేఆర్ఎంబీ) తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నుంచి తగిన సూచనలు, ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఆ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని