Published : 13 Aug 2020 19:30 IST

అంబులెన్స్‌ ఖర్చులు.. పేదల గుబులు

హైదరాబాద్‌: కరోనా కష్టాల్లో కరుణ చూపాల్సిన వారు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సాటి మనుషుల పట్ల దయ, జాలి చూపడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే పేదలనూ వదలడం లేదు. ప్రాణాలను నిలపాల్సిన అంబులెన్స్‌ నిర్వాహకులు జేబులు నింపుకొంటున్నారు. కొవిడ్‌ దెబ్బకు అనేక మంది ఉపాధి కోల్పోగా అంబులెన్స్‌ల యజమానులు మాత్రం తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, టిమ్స్‌తో పాటు పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. వైద్య చికిత్సతో పాటు అత్యవసర సమయాల్లో కొవిడ్‌ బాధితులను  మెరుగైన వైద్యం కోసం వాహనాల్లో తిప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కొందరిని సీటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షల కోసం తరలిస్తుంటారు. వాటిని అంబులెన్స్‌ నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆసుపత్రుల వద్ద తిష్ట వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితులపై ఏ మాత్రం కనికరం చూపడం లేదు. రోగి ప్రాణాల మీదకు వచ్చింది.. విషమం.. అంటే చాలు భారీగా వసూలు చేస్తున్నారు. ఒకరిని కాదని, ఇంకొకరిని అడిగినా పరిస్థితిలో మార్పు లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

గతంలో సీటీస్కాన్‌, ఇతర అవసరాల కోసం వెళ్లాలంటే రూ.1,500 నుంచి రూ.2వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఇస్తేనే అంబులెన్స్‌ కదులుతోంది. పీపీఈ కిట్‌ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సాధారణ సమయాల్లో ధరల కంటే రెండు మూడు రెట్లు ధరలు ఎక్కువ చేసి చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

గ్రేటర్‌ పరిధిలో సుమారు 500 వరకు ప్రైవేటు చిన్న, పెద్ద అంబులెన్స్‌లు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి జిల్లా కేంద్రాలకు రోగులను, మృతదేహాలను తరలించాలంటే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. 150 నుంచి 175 కిలోమీటర్ల వరకు రూ.8వేల నుంచి రూ.10వేలు తీసుకుంటున్నారు. అధికారుల అనుమతితో పొలాలు, పెరట్లో ఖననం చేసేందుకు తీసుకువెళ్తే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు లాగుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సకు ఏ మాత్రం తక్కువ కాకుండా అంబులెన్స్‌ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కిరాయి చెల్లించలేనివారు ఆటోలు, ట్రాలీ ఆటోల్లో తీసుకువెళ్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ వైపు చూసేవాళ్లు ఆ వాహనం చూస్తేనే బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు కాపాడటంతో పాటు మృతదేహాలను తరలించాల్సిన అంబులెన్స్‌ల నిర్వాహకులు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని