
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కోలాహలం
హైదరాబాద్: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు తరలివస్తున్నాయి. గణనాథుల రాకతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై, గణపతి బొప్పా మోరియా అంటూ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. గతంలో పెద్ద పెద్ద విగ్రహాలతో భారీ ఊరేగింపుతో వచ్చేవారు. కానీ, ఈసారి కొవిడ్ నేపథ్యంలో చిన్న చిన్న విగ్రహాలను అందం ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్‌లో 5, ట్యాంక్‌బండ్‌పై 10, రోటరీ పార్కు వద్ద 2, ఇతర ప్రాంతాల్లో మరో 4 క్రేన్లను పోలీసులు సిద్ధం చేశారు.
నిమజ్జనానికి బయల్దేరిన బాలాపూర్ గణేశుడు
ప్రసిద్ధ బాలాపూర్ గణేశుడు నిమజ్జనానికి బయల్దేరాడు. కోవిడ్ నేపథ్యంలో తగు నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌లో ప్రారంభమైన శోభాయాత్ర దాదాపు 18 కిలోమీటర్లు సాగనుంది. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.30 సమయంలో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.
రాత్రిలోపు 2500విగ్రహాల నిమజ్జనం..
ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బాలాపూర్ గణేశ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గణనాథుల నిమజ్జన ఏర్పాట్లను మధ్యమండలం సంయుక్త కమిషనర్ విశ్వప్రసాద్‌తో కలిసి సీపీ పర్యవేక్షించారు. ఇప్పటి వరకు 400గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని.. రాత్రి లోపు 2,500 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు సీపీ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.