Updated : 14 Jul 2022 19:23 IST

Telangana News: జలదిగ్బంధంలో భద్రాద్రి రామయ్య.. 3 రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీపరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత జులై రెండో వారంలో 60 అడుగులు దాటడం ఇదే ప్రథమం. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రం 4 గంటలకు 61.5 అడుగుల వద్ద కొనసాగుతుంది.

80 అడుగుల మేర వచ్చినా తట్టుకునేలా..

1986లో గోదావరి వరదలకు భద్రాచలం పట్టణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆలయ పరిసరాల్లోని కాలనీలన్నీ నీటమునిగాయి. ఈ సమస్యను గుర్తించిన అప్పటి ప్రభుత్వం కరకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ కరకట్టే పట్టణానికి శ్రీరామరక్షగా మారింది. దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా కరకట్ట నిర్మాణం చేపట్టినప్పటికీ  స్లూయీస్‌ల నిర్మాణంలో లోపాల వల్ల లీకేజీలు తలెత్తేవి. అయితే, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి నీటిమట్టం భారీగా పెరగడంతో ఈసారి ఏకంగా వరదనీరు కరకట్టను తాకింది. మొదటి ప్రమాద హెచ్చరిక 43, రెండోప్రమాద హెచ్చరిక 48, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు ఉండగా.. ప్రతీ హెచ్చరికకు మధ్య 5 అడుగుల వ్యత్యాసం ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి 24 గంటలు గడవక ముందే ప్రవాహ ఉద్ధృతి ఏకంగా 8 అడుగులకు మించి పోటెత్తడం గమనార్హం. గంట గంటకూ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. బుధవారం రాత్రి 9 గంటలకు 55.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 3 అడుగుల మేర పెరిగింది. ఆ తర్వాత వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. బుధవారం 14 లక్షల నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల కాగా.. గురువారం ఏకంగా 18 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

3 రాష్ట్రాలకు రాకపోకలు బంద్

వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షపాతం గణనీయంగా నమోదుకావడం, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి వారధి అతలాకుతలమైంది. వంతెన చరిత్రలో రెండోసారి రాకపోకలు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1986లో తొలిసారిగా గోదావరి నీటిమట్టం 75.6 అడుగులకు చేరడంతో ముందు జాగ్రత్తగా గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత 36ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి వంతెనపై ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిషేధించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు వారధిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. దీంతో.. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ‌ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు. 

కాలనీలను చుట్టుముట్టిన వరద

స్లూయీస్‌ల లీకేజీలతో లోతట్టు ప్రాంతాలకు ముంపు వాటిల్లింది. సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ, ఏఎంసీ కాలనీ, కొత్తకాలనీల్లోని పదుల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు తిరిగే వీధుల్లో చిన్నతెప్పలతో సామాన్లు తరలించుకోవడం వరద తీవ్రతకు అద్దంపట్టింది. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. పారిశుధ్ధ్యం, తాగునీరు, వైద్య సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇది వ్యాధుల సీజన్‌ కావడంతో పునరావాస కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ముంపు వాటిల్లే ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. పురుడు సమయం ఆసన్నమైన గర్భిణీలను ఆస్పత్రుల్లో చేర్పించారు. భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో నిపుణుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని