Andhra News: ముంచెత్తిన వానలు.. పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం

కోస్తాంధ్ర తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అగచాట్లు పడ్డారు.

Published : 06 Oct 2022 20:51 IST

అమరావతి: కోస్తాంధ్ర తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అగచాట్లు పడ్డారు.రహదారులపై వాననీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో...

రాత్రి నుంచి కురుస్తు్న్న వర్షాలతో విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. నున్న సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇటీవల కొత్తగా రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థను వదిలేయడంతో మురుగునీరు రోడ్డును ముంచెత్తింది. ఎన్టీఆర్‌జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వత్సవాయి మండలంలోని గండివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెనుగంచిప్రోలులోని చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. 

గుంటూరులో ఎడతెరిపిలేని వాన..

గుంటూరులో ఎడతెరిపిలేని వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని 3వంతెనల సెంటరుతో పాటు శివారు కాలనీల్లోని రోడ్లపై గోతులన్నీ వాననీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పంటపొలాలు నీటమునిగాయి. ప్రత్తిపాడు, కాకుమాను, పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు, తుళ్లూరు, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో జోరు వానలు కురిశాయి. బాపట్ల, చీరాల, పర్చూరు, చినగంజాం, మార్టూరు, అద్దంకిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతచీరాల కూడలిలో జాండ్రపేట శివాలయం వద్ద  చీరాల - ఒంగోలు ప్రధాన రహదారిపై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

విశాఖలో పలు కాలనీలు జలమయం..

విశాఖలో కుండపోత వర్షానికి పలు కాలనీలు, ఇళ్లు జలమయమయ్యాయి. సెంట్రల్‌ జైలు సమీపంలోని రామకృష్ణాపురంలో వరదనీరు భారీగా ఇళ్లలోకి చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లలోకి వరదనీరు చేరకుండా రక్షణ గోడ నిర్మించినప్పటికీ రాత్రి ఒక్కసారిగా వరదనీరు కాలనీని చుట్టుముట్టింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చిన్నపిల్లలతో రాత్రంతా చీకట్లోనే ఉన్నామని కాలనీ వాసులు వాపోయారు.

నరసాపురంలో వాహనదారుల అవస్థలు..

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలు నీటమునగడంతో స్టార్ట్‌ కాకుండా మొరాయించాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల కుండపోత..

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల కుండపోత వానలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొనకమిట్ల మండలం నాయుడుపేటలో ఇళ్లలోకి వరదనీరు చేరి జనం అవస్థలు పడ్డారు. మార్కాపురం మండలం వడ్డిచెర్ల వద్ద గుండ్లకమ్మ వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచాయి. నాగులుప్పలపాడు మండలం గ్రో సెంటరు నుంచి  ఉప్పుగుండూరు వెళ్లే దారిలో ఉన్న కొత్తకోట కాల్వ ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో కారుతోపాటు అందులోని ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. బేస్తవారిపేట, కంభం, కొమరోలు, అర్థవీడు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జంపలేరు, గుండ్లకమ్మ, పులివాగు, నల్లవాగుకు వరద పోటెత్తింది. కంభంలోని కాలనీల్లోకి వరదనీరు చేరింది.  కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధి దొడగట్ట గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలింది. నంద్యాలలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని