Tirumala: భక్తజనసంద్రమైన తిరుమల.. కాసేపట్లో గరుడవాహన సేవ

రెండేళ్ల తర్వాత భక్తుల మధ్యలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం రెండో శనివారం కావడం, శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవ... ఈ 3 అంశాలు కలిసి రావడంతో తిరుమల గిరులు భక్తజనసంద్రంగా మారాయి.

Published : 01 Oct 2022 17:44 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాత్రి 7గంటల నుంచి ప్రారంభమయ్యే గరుడ సేవను తిలకించేందుకు  పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో వివరించిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అక్కడే ఉండి గరుడసేవ కోసం వేచి చూస్తున్నారు. దీంతో తిరుమల పరిసర ప్రాంతాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

రెండేళ్ల తర్వాత భక్తుల మధ్యలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం రెండో శనివారం కావడం, శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవ... ఈ 3 అంశాలు కలిసి రావడంతో తిరుమల గిరులు భక్తజనసంద్రంగా మారాయి. వాహన మండపం నుంచి తూర్పు మాడవీధి, దక్షిణ మాడవీధి, పశ్చిమ మాఢవీధి తిరిగి ఉత్తరమాడ వీధివైపు వచ్చి ఈశాన్య భాగంలో గరుడ వాహనం ఆపే సమయంలో  భక్తులను క్యూలైన్ల ద్వారా  స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు. తితిదే ఈసారి ప్రయోగాత్మకంగా ఈవిధానాన్ని చేపట్టింది. ఈశాన్య భాగంలో ఉన్న వెంగమాంబ అన్నదాన సత్రం వద్ద రాత్రి 11..12 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశముంది. దీంతో ఈ ప్రాంతానికి భక్తులు భారీగా చేరుకున్నారు. దాదాపు 1.40లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. నాలుగు మాడ వీధుల గ్యాలరీలు భక్తులతో నిండిపోవడంతో అధిక సంఖ్యలో బయట ఎదురు చూస్తున్నారు. గరుడ సేవ ప్రారంభమైన తర్వాత మరి కొందరిని మాడవీధుల్లోకి అనుమతించే అవకాశముంది. గరుడ సేవను తిలకించేందకు దాదాపు 3లక్షల మంది తిరుమలకు వస్తారని తితిదే అంచనా వేసింది. తిరుమలలో మాడ వీధులను తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. భక్తులను కలిసి సౌకర్యాలపై ఆరా తీశారు. సకాలంలో అన్న ప్రసాదాలు, పాలు అందుతున్నాయా? అని భక్తులను అడిగి తెలుసుకున్నారు.  గ్యాలరీల్లో ఉన్న భద్రతా సిబ్బంది భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని ఆదేశించారు. భద్రతపరంగా మాడ వీధులను పర్యవేక్షించేందుకు నలుగురు ఎస్పీలను నాలుగు భాగాలుగా విభజించారు. భక్తుల వాహనాలకు తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని