విజయవాడ హైవేపై స్తంభించిన ట్రాఫిక్‌

వరుణుడి ప్రతాపానికి అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సమీప చెరువులు పొంగిపొర్లుతున్నాయి...

Updated : 18 Oct 2020 13:33 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌ (హైదరాబాద్)‌: వరుణుడి ప్రతాపానికి అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సమీప చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లష్కర్‌ గూడ చెరువు ఉద్ధృతికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ ప్రాంతంలో జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటం, రహదారి దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు, అటు కొత్తగూడెం వరకు ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వరదనీటి కారణంగా నిలిచిపోయాయి. శనివారం చేపట్టిన రహదారి మరమ్మతులు సైతం వరద కారణంగా ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై..
హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై గగన్‌పహాడ్‌ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బాహ్యవలయ రహదారి మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు. ఆదివారం ఉదయం గగన్‌పహాడ్‌ వద్ద జాతీయ రహదారిని, గగన్‌పహాడ్‌ చెరువు, అప్ప చెరువు, పల్లె చెరువును సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

వరంగల్‌ హైవేపై వాహనాల మళ్లింపు..
భారీ వర్షం కారణంగా ఉప్పల్‌ సమీపంలోని నల్లచెరువు పొంగి హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరంగల్‌, యాదాద్రి, భువనగిరి నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ మీదుగా దారి మళ్లించారు.

నగరంలో పలు రహదారులు మూసివేత
వరద వల్ల హైదరాబాద్‌ నగరంలోని పలు రహదారులను ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. మలక్ పేట రైల్  వంతెన రోడ్, గడ్డి అన్నారం నుంచి శివగంగ రోడ్,  మూసారాంబాగ్ వంతెన - చాదర్ ఘాట్ రోడ్, పురానాపూల్ 100ఫీట్ల రోడ్, టోలిచౌక్‌ రోడ్, - మొఘల్ కాలేజ్ నుంచి బండ్లగూడ మీదుగా ఆరాంఘర్ వేళ్ళే దారి, ఫలక్ నూమ రైల్వే బ్రిడ్జ్ రోడ్, మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి ఐఎస్ సదన్‌ రోడ్‌ మూసివేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని